కరోనా చికిత్సకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వినియోగిస్తున్నాయి పలు దేశాలు. తాను కూడా ఈ మందును తీసుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే.. ఈ మందు వినియోగంతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాలోని భారత సంతతి డాక్టర్ భరత్ బరాయ్.
హెచ్‌సీక్యూ వైద్యుల పర్యవేక్షణలో ఇచ్చినట్లయితే.. దుష్ప్రభావాలు తలెత్తినా తగ్గించొచ్చని పేర్కొన్నారు బరాయ్. అమెరికాలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై రాజకీయాలు చేస్తున్నారన్నారు.
కొన్ని మీడియా నివేదికలు, వైద్యులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శించటం, హైడ్రాక్సీక్లోరోక్విన్ దుష్ప్రభావాలను ఎక్కువ చేసి చూపటాన్ని గమనించినట్లు పేర్కొన్నారు డా. భరత్.
" అన్ని ఔషధాలు కొంత మేర దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అది ఎప్పుడూ ప్రయోజనాలు, ప్రమాదాలపై ఆధారపడి ఉంటుంది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎఫ్‌డీఏ అనుమతించింది. లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపే వ్యాధులకు సంవత్సరాలుగా ఈ మందును వినియోగిస్తున్నారు. చాలా మంది రోజుకు ఒకటి లేదా రెండు ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. ఏళ్ల పాటు ప్రతిరోజు తీసుకునే వారికి సురక్షితమైతే.. కరోనా వైరస్ చికిత్సలో కూడా ఇది సురక్షితమే. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైనవారు, పాజిటివ్‌గా తేలిన వారికి 14 రోజుల పాటు చికిత్స చేసేందుకు దాని వినియోగం గురించి మాట్లాడుతున్నాం. వైద్యుల పర్యవేక్షణలో వినియోగిస్తే ఏదైనా దుష్ప్రబావాలు ఏర్పడితే.. వాటిని పరిష్కరించవచ్చు."