తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్‌-అమెరికా 'తొలి' రక్షణ సంబంధాల సదస్సు - భారత్‌లోని అమెరికా రక్షణ వ్యవహారాల చీఫ్‌ కెప్టెన్‌ డేనియల్‌ ఫిలియన్‌

రక్షణ వ్యవహారాల హబ్‌గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా బుధ, గురువారాల్లో భారత్‌-అమెరికా రక్షణ సంబంధాల సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాల రక్షణ సంబంధాలు, సదస్సు లక్ష్యాలపై డేనియల్‌ ఫిలియన్‌ ఈ-మెయిల్‌ ద్వారా ‘ఈనాడు’తో ముఖాముఖిలో మాట్లాడారు.

terrorism
భారత్‌-అమెరికా రక్షణ సంబంధాల సదస్సు

By

Published : Dec 17, 2019, 7:07 AM IST

Updated : Dec 17, 2019, 7:32 AM IST

‘భారత్‌-అమెరికా సంబంధాలు గతంతో పోలిస్తే మరింత బలోపేతమవుతున్నాయి. రెండు దేశాల్లోని ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే అందుకు ప్రధాన కారణం. ఈ అనుబంధం రెండు దేశాలకూ ఉపయుక్తమే. ఉగ్రవాదమే ప్రపంచానికి పెనుముప్పు అని అమెరికా ఇప్పటికీ భావిస్తోంది. దాన్ని కూకటివేళ్లతో పెకలించడం అంత సులభం కాదని తెలుసు. సారూప్యత, ఉమ్మడి విశ్వాసం ఉన్న భారత్‌ లాంటి దేశాలతో కలిసి పనిచేసి ఆ సవాళ్లను అధిగమిస్తాం’’ అని భారత్‌లోని అమెరికా రక్షణ వ్యవహారాల చీఫ్‌ కెప్టెన్‌ డేనియల్‌ ఫిలియన్‌ చెప్పారు.

రక్షణ వ్యవహారాల పరంగా భారత్‌-అమెరికా సంబంధాలు ఎలా ఉండాలని భావిస్తున్నారు?

భారత్‌-పసిఫిక్‌ కోణంలో రక్షణ రంగ సంబంధాలు స్పష్టంగా, నిక్కచ్చిగా ఉండాలన్నది ఇరు దేశాల ఉద్దేశం. ఈ రకంగా చూస్తే భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయన్నది సుస్పష్టం.

సంబంధాలు మెరుగుపడేందుకు విధానపరంగా దోహదం చేసిన అంశాలు ఏమిటి?

గడిచిన నాలుగు ప్రభుత్వాలతో పోల్చినప్పుడు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రెండు దేశాల ప్రభుత్వాల వ్యూహాలు, విధానాల కారణంగా రక్షణ రంగ సంబంధాలు అంతకంతకూ బలపడుతున్నాయనడంలో సందేహం లేదు. రక్షణపరంగా భారత్‌కు మద్దతు ప్రకటించే విషయంలో ఇరు దేశాల మధ్య ఓ అంగీకారం కూడా కుదిరింది. దీనికి అమెరికా కాంగ్రెస్‌ కూడా ఆమోదం పలికింది. ఇలా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలు రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్నాయి. క్రమంగా ఇవి మరింత బలపడతాయని విశ్వసిస్తున్నా.

భారత్‌ ఎదుర్కొంటున్న రక్షణ సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా ఎలాంటి సహకారాన్ని అందించబోతోంది?

భారతదేశం తమ శక్తి సామర్థ్యాలను, లక్ష్యాలను ఆధునికీకరించుకునే దిశగా సహాయపడేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకూ తోడ్పాటును అందిస్తోంది. భవిష్యత్తులో పారిశ్రామిక, అంతరిక్ష, సైబర్‌ రంగాల్లోనూ సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకునే విధానం కొనసాగాలని అమెరికా కోరుకుంటోంది.

ప్రస్తుతం అగ్రరాజ్యానికి ఉన్న ప్రధాన ముప్పు ఏమిటి? దాన్ని ఎదుర్కొనేందుకు ఆ దేశం అనుసరిస్తున్న వ్యూహాలు ఏమిటి?

ఉగ్రవాదమే మా దేశానికి ఉన్న తీవ్రమైన ముప్పు అని ఇప్పటికీ నమ్ముతున్నాం. దాన్ని అంతమొందించడం అంత సులువేమీ కాదు. ఇదేదో ఒకట్రెండు దేశాల సమస్య అంతకన్నా కాదు. ప్రపంచ సమస్య. దాన్ని కూకటివేళ్లతో పెకలించగలమనే విశ్వాసం ఉంది. అమెరికా తరహా దృష్టి కోణాలు ఉన్న దేశాల మధ్య పరస్పర అవగాహన, గౌరవం, నమ్మకం పెంపొందించడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించేందుకు కృషి చేస్తున్నాం.

భారత్‌-అమెరికా మధ్య రక్షణ రంగంలో ఎలాంటి ఉమ్మడి లక్ష్యాలుండాలని భావిస్తున్నారు?

ప్రపంచ వ్యాప్తంగా, ప్రాంతీయంగా సుస్థిరత నెలకొనేలా చూడటం ఇరుదేశాల ఉమ్మడి లక్ష్యాలుగా ఉండాలనేది మా అభిప్రాయం. ఉగ్రవాదంపై పోరాడటం మరో కీలక అంశం. అలాగే అన్ని దేశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించటం, సంపద అందరికీ సమానంగా పంపిణీ అయ్యేలా చూడటం కూడా ఉమ్మడి లక్ష్యాల్లోని మరో అంశం.

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రక్షణ సదస్సు ప్రధాన లక్ష్యాలు ఏమిటి?

ఇరుదేశాల భాగస్వాములు తమ రక్షణ వనరులను, సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకునేలా సహకరించడం సదస్సు ప్రధాన లక్ష్యం. మా సైనిక పాటవాలతోపాటు, శాస్త్రవేత్తల పరిశోధనల్లోని పురోగతిని ఇచ్చిపుచ్చుకోవడమూ జరుగుతుంది. తద్వారా ఇరు దేశాల రక్షణ రంగాల మధ్య మెరుగైన సంబంధాలను నెలకొల్పడానికి కృషి చేస్తాం.

ఇదీ చూడండి : మనుషులకే కాదు.. చేపలకూ శ్మశానవాటికలు..!

Last Updated : Dec 17, 2019, 7:32 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details