పౌర సమాజం, ప్రసార మాధ్యమాల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుబట్టింది అమెరికా. చట్టాన్ని గౌరవించాలని ఆ దేశానికి సూచించింది. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ.. ఆసియా-పసిఫిక్ నాన్‌ప్రొలిఫరేషన్‌పై వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో దక్షిణ-మధ్య ఆసియా సహాయ కార్యదర్శి అలిస్ జీ వెల్స్ ఈ అంశంపై మాట్లాడారు.
ప్రస్తుత అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రణాళిక ప్రకారం పాకిస్థాన్ నూతన సంస్కరణలకు పునాది వేయాలని సూచించారు. ఈ ప్రణాళికతో మెరుగైన ఆర్థిక వృద్ధితో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ, మానవ హక్కుల అంశాల మెరుగుదలకు దారితీయాలని అభిప్రాయపడ్డారు.
మానవ హక్కుల ఉల్లంఘన, పాక్ పౌరులు ఎదుర్కొంటున్న మత వివక్ష గురించి తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించారు వెల్స్.
"ఇటీవలి కాలంలో, పాకిస్థాన్లో పౌర సమాజం, మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యం తగ్గిపోవడం వంటి ఇబ్బందికరమైన పోకడలను మేం గమనించాం. పాక్లో వేధింపులు, బెదిరింపులు, ఆర్థిక బలప్రయోగం వంటి చర్యలతో మీడియా సహా పౌర సమాజంపై ఒత్తిడి బాగా పెరిగింది."
-అలిస్ జీ వెల్స్
దైవదూషణ చట్టాల అమలు కారణంగా డజన్ల కొద్దీ పాకిస్థానీలకు మరణశిక్ష, జీవిత ఖైదు విధించారని... కొన్ని సార్లు, విదేశీ నటీనటులను కూడా వారి మత వివక్ష ఇబ్బందిపెడుతోందన్నారు. ఈ కారణంగా.. ఎందరో హింసకు గురయ్యారని, పాక్ విధానాలు అహ్మదీయ ముస్లిం వర్గం పట్ల వివక్ష చూపే విధంగా ఉన్నాయని వెల్స్ చెప్పుకొచ్చారు.
పాక్లో లష్కరే-ఝాంగ్వీ , తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ వంటి సంస్థలతో ప్రత్యక్ష ముప్పు ఉందని తెలిపారు వెల్స్. అత్యంత తీవ్రమైన ఉగ్రవాద సంస్థలను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని సూచించారు..
ఇదీ చూడండి:ఆ ప్రాంత ఉద్యోగులకు కేంద్రం తీపికబురు