తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2019, 6:53 AM IST

Updated : Oct 1, 2019, 3:58 PM IST

ETV Bharat / international

ట్రంప్ 'మహా ప్రత్యేకం' - మోదీ ఓ 'అద్భుతం'

హౌడీ-మోదీ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మధ్య స్నేహం వెల్లివిరిసింది. ఇరువురు నేతలు పరస్పరం ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. ట్రంప్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ప్రపంచంలోని ప్రతిఒక్కరికీ తెలిసిన వ్యక్తి అని కీర్తించారు మోదీ. మరోవైపు.. మోదీని గొప్ప మిత్రునిగా ట్రంప్​ అభివర్ణించారు. ఆయన నేతృత్వంలో భారత్​ అభివృద్ధిలో దూసుకుపోతోందని.. ప్రపంచమే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు.

ట్రంప్ 'ప్రత్యేకం' - మోదీ 'అద్భుతం'

ట్రంప్ 'మహా ప్రత్యేకం' - మోదీ ఓ 'అద్భుతం'

హౌడీ-మోదీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. ట్రంప్‌ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని మోదీ కీర్తించారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ హిందూ నేతలు వినిపించిన అబ్‌కీ బార్‌-ట్రంప్‌ సర్కార్‌ అన్న నినాదంతో భారత్‌ చాలా అనుసంధానమై ఉందని తెలిపారు. ఈ వేదికపై... మోదీని చాలా గొప్ప మిత్రుడిగా ట్రంప్​ అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో భారత్‌ బలమైన, సార్వభౌమ దేశంగా ఎదుగుతుండడానికి ప్రపంచం సాక్ష్యంగా ఉందని పేర్కొన్నారు.

ట్రంప్​... చాలా ప్రత్యేకం

అమెరికా హ్యూస్టన్‌లోని ఎన్​ఆర్​జీ స్టేడియంలో ప్రవాస భారతీయులతో జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ను మోదీ చాలా విశిష్ట వ్యక్తిగా అభివర్ణించారు.

"ఈ ఉదయం చాలా ప్రత్యేకమైన వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనకు ఎలాంటి పరిచయం అక్కరలేదు. ఆయన పేరు ఈ భూగ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచ రాజకీయాల మీద జరిగే ప్రతి చర్చలో ఆయన పేరు ప్రస్తావనకు వస్తుంది. అత్యున్నత పదవిని అధిష్టించడానికి ముందే ఈ దేశంలో ఆయన చాలా ప్రఖ్యాతి గాంచారు. ముఖ్య కార్యనిర్వహణాధికారి నుంచి సర్వ సైన్యాధ్యక్షుడిగా, వార్డ్‌రూమ్‌ నుంచి ఓవల్‌ కార్యాలయానికి, స్డూడియోల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, రాజకీయాలు, ఆర్థిక రంగం, భద్రతా రంగంలో ఆయన తన ముద్రవేశారు. ట్రంప్‌తోనూ, అధ్యక్ష ఎన్నికల్లో అబ్‌కీ బార్‌-ట్రంప్‌ సర్కార్‌ అన్న పదంతోనూ భారత్‌ చాలా అనుసంధానమై ఉంది. "- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

నవ ప్రపంచ నిర్మాణం కోసం ఇరుదేశాల్లోనూ సమానమైన సంకల్పం ఉందని మోదీ అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి భారత్‌కు రావాలని ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. 'మన ఇద్దరి స్నేహం..... భారత్‌, అమెరికా సంయుక్త కలలు, శక్తిమంతమైన భవిష్యత్తుకు సరికొత్త శిఖరాలను అందిస్తుంది' అని పేర్కొన్నారు.

మోదీ.. గొప్ప మిత్రుడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీని గొప్ప మిత్రుడిగా అభివర్ణించారు. భారత్‌ను అమెరికన్లు అందరం ప్రేమిస్తామని తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతూ.. బలమైన దేశంగా ఎదగడాన్ని ప్రపంచం చూస్తోందని కీర్తించారు.

"ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధిపథంలో సాగుతూ అత్యంతబలమైన, సార్వభౌమ దేశంగా.. ముందుకు సాగుతున్న తీరును ఈ ప్రపంచం చూస్తోంది. ప్రధాని మోదీ వృద్ధికారక సంస్కరణలతో ఒక్క దశాబ్దంలోనే భారత్‌లోని 30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.ఇది నమ్మశక్యం కాని విషయం. వచ్చే దశాబ్దంలో... మరో 14 కోట్ల మంది భారతీయులు మధ్యతరగతిలోకి చేరుతారు. ప్రస్తుతం భారత్‌, అమెరికాల్లోని ప్రజలు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయాలను చూస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగ కల్పన విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్న అధికారుల వైఖరిని తొలగించడాన్ని ప్రస్తుతం రెండు దేశాల ప్రజలు అనుభవిస్తున్నారు."- డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మోదీకి, తనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలకడం పట్ల ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​తో కలిసి ముందుకు సాగుతాం: ట్రంప్​

Last Updated : Oct 1, 2019, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details