తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​తో కలిసి ముందుకు సాగుతాం: ట్రంప్​

అమెరికా హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్​తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేస్తూ.. పాకిస్థాన్​కు పరోక్షంగా ఝలక్ ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యం నుంచి రోదసీ పరిశోధనల వరకు భారత్​తో కలిసి ముందుకు సాగుతామని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్​తో కలిసి ముందుకు సాగుతాం: ట్రంప్​

By

Published : Sep 23, 2019, 5:46 AM IST

Updated : Oct 1, 2019, 3:55 PM IST

భారత్​తో కలిసి ముందుకు సాగుతాం: ట్రంప్​

భారత్​- అమెరికాలకు సరిహద్దు భద్రత అత్యంత ప్రాధాన్య అంశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పేర్కొన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి అమాయకులు బలి కాకుండా భారత్​తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్​కు పరోక్ష హెచ్చరికలు పంపారు. ద్వైపాక్షిక వాణిజ్యం సహా రోదసీ పరిశోధనల వరకు భారత్​తో కలిసి ముందుకు సాగుతామని ట్రంప్ ప్రకటించారు.

ఘనస్వాగతం

హ్యూస్టన్​లో నిర్వహించిన హౌడీ-మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆయనకు భారత విదేశాంగమంత్రి జై శంకర్​ స్వాగతం పలికారు. తరువాత మోదీ చేయి పట్టుకుని ట్రంప్​ ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి వెళ్లారు.

కలిసి ముందుకెళదాం

హౌడీ-మోదీ కార్యక్రమంలో భాగంగా ప్రధానిపై ట్రంప్​ ప్రశంసల జల్లు కురిపించారు. భారత్​కు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఇరుదేశాలు కలిసి ముందుకు సాగితే.. దేదీప్యమానమైన ప్రపంచ ఆవిష్కారం దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు.

"ప్రస్తుతం భారతీయ అమెరికన్ల వెలుగుల్లోనే అమెరికా గొప్పదనం ముడిపడి ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నవారంతా అమెరికా, భారత్‌ గొప్ప భవిష్యత్‌ కోసం పనిచేస్తున్నారు. భారత్‌తో సంబంధాలను మేం మరింత పటిష్ఠ పర్చుకుంటూ ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని, స్వేచ్చ యొక్క గొప్పదాన్ని చాటిచెబుతున్నాం. ఇరుదేశాల ప్రజలు, పిల్లలు, ప్రపంచం కోసం ఆధునికతను సాధిస్తాం. భారత్‌, అమెరికాలు కలిసి నూతన సాంకేతికతలను ఆవిష్కరిస్తే..కోట్లాదిమంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావొచ్చు. భారత్‌, అమెరికాలు కలిస్తే.. రెండు దేశాలు బలంగా తయారవుతాయి. ఇరుదేశాల్లో ప్రజలు సంపన్నులుగా మారుతారు. మన కలలు పెద్దగా ఉంటాయి. మన భవిష్యత్‌...... గతంలో ఏనాడూలేనంత దేదీప్యమానంగా ఉంటుంది."-డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు

ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి అమాయకులను కాపాడుకునేందుకు భారత్​-అమెరికా కట్టుబడి ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.

"ఇస్లామిక్‌ తీవ్రవాదం నుంచి అమాయకులైన పౌరులను కాపాడేందుకు మేము కట్టుబడి ఉన్నాం. తమ తమ ప్రజలు భద్రంగా ఉండాలంటే సరిహద్దులను కాపాడుకోవాలనే విషయాన్ని భారత్‌, అమెరికాలు రెండూ అర్థం చేసుకున్నాయి. సరిహద్దు భద్రత అనేది అమెరికాకు, భారత్‌కు అత్యంత ప్రాధాన్యమైన విషయమని మేం అర్థం చేసుకున్నాం."-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

రక్షణ భాగస్వామ్యం

భారత్-అమెరికాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. రోదసీలోనూ పరస్పర సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు.

"భద్రత విషయంలో భారత్‌, అమెరికాలు బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నాయి. అమెరికా రక్షణ పరికరాలను భారత్‌కు విక్రయిస్తోంది. గత దశాబ్ద కాలంలో 18బిలియన్‌ డాలర్ల రక్షణ పరికరాలు విక్రయించాం.ప్రపంచంలోనే అత్యంత బలమైన రక్షణ వ్యవస్థను పరికరాలను మేం(అమెరికా) తయారు చేస్తున్నాం. ఈ విషయం భారత్‌కు కూడా పూర్తిగా తెలుసు. త్వరలోనే రక్షణ పరికరాలకు సంబంధించి కొత్త ఒప్పందాలను చేసుకోగలమని నేను భావిస్తున్నాను. అమెరికాలో నూతన అంతరిక్ష బలగాన్ని తయారుచేస్తున్నాం. అంతరిక్ష రంగంలో కూడా పరస్పరం సహకరించుకుంటున్నాం. " -డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మోదీ సర్కార్​... భేష్​

పేదరికం నిర్మూలనకు మోదీ సర్కార్​ తీసుకుంటున్న చర్యలపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. బ్యూరోక్రసీలో ఉన్న రెడ్​టేపిజం నిర్మూలనకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.

"ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌ అభివృద్ధిపథంలో సాగుతూ అత్యంత బలమైన, సార్వభౌమ దేశంగా ముందుకు సాగుతున్న తీరును ఈ ప్రపంచం చూస్తోంది. ప్రధాని మోదీ వృద్ధికారక సంస్కరణలతో ఒక్క దశాబ్దంలోనే భారత్‌లోని 30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది నమ్మశక్యం కాని విషయం. వచ్చే దశాబ్దంలో మరో 14 కోట్ల మంది భారతీయులు మధ్యతరగతిలోకి చేరుతారు. ప్రస్తుతం భారత్‌, అమెరికాల్లోని ప్రజలు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయాలను చూస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగ కల్పన విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్న అధికారుల వైఖరిని తొలగించడాన్ని ప్రస్తుతం రెండు దేశాల ప్రజలు అనుభిస్తున్నారు."- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వస్తువులను భారతీయులకు అందించేందుకు అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ తెలిపారు. అతి త్వరలో భారత్​లో తొలి ఎన్​బీఏ బాస్కెట్​ బాల్​ గేమ్​ జరుగుతుందని ట్రంప్​ చెప్పారు. మోదీ ఆహ్వానిస్తే తప్పనిసరిగా ముంబయిలో జరిగే ఈ మ్యాచ్​ చూసేందుకు వస్తానని ట్రంప్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎన్​ఆర్ఐ​ల ప్రశ్నకు తెలుగులో మోదీ జవాబు

Last Updated : Oct 1, 2019, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details