కరోనా వైరస్ సోకిన తర్వాత శరీరంలో వివిధ అవయవాలపై ఆ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అయితే, కరోనా వైరస్ ఊపిరితిత్తులను ఎలా నష్టపరుస్తోందన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీనిపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు, ఊపిరితిత్తుల కణాలను ఈ కరోనా వైరస్ ఎలా దెబ్బతీస్తోందన్న విషయాన్ని డీకోడ్ చేయగలిగారు. దీంతో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే చికిత్సను రూపొందించడంలో తాజా పరిణామం దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం మాలిక్యులార్ సెల్ జర్నల్‌లో ప్రచురితమైంది.
కరోనాకు కారణమైన సార్స్-కోవ్-2 వైరస్ ఊపిరితిత్తుల్లో ఏ విధంగా నష్టాన్ని చేకూరుస్తుందని తెలుసుకునేందుకు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (బీయూఎస్‌ఎం) శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. ఇందుకోసం స్పెక్ట్రోమెట్రీ సాంకేతిక సాయంతో ఊపిరితిత్తుల్లోని కణాల శాంపిళ్లలోని అణువులను వర్గీకరించి విశ్లేషించారు. సార్స్-కోవ్-2 వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తుల్లోని కణాలు, ప్రోటీన్ల మార్గంలో మార్పులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఫాస్ఫోరైలేషన్ అని పిలిచే కీలక ప్రోటీన్ మార్పును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దేహంలోని కణాల్లో ప్రోటీన్ పనితీరును నియంత్రించడంలో ఈ ఫాస్ఫోరైలేషన్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది.