కరోనా వైరస్ బారినపడ్డ వ్యక్తి వయస్సు సహా ఇతర అనారోగ్య సమస్యలపై ఆధారపడి.. సదరు బాధితుడు కోలుకోవడం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువ మంది కరోనా రోగుల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని.. వారు త్వరగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కరోనా నుంచి బయటపడడానికి ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలిపారు.
ఊబకాయులు, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై.. కొవిడ్ ప్రభావం ఎక్కువ రోజులు ఉంటున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పరిశోధకులు వెల్లడించారు. కొవిడ్ నుంచి కోలుకోవడానికి కనీసంగా 2 నుంచి 6 వారాల సమయం పడుతుందని తెలిపారు. 18 నుంచి 34 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారు కరోనా సోకిన తర్వాత ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటే వారు కొవిడ్ నుంచి కోలుకోవడానికి కనీసం 2 వారాల సమయం అవసరమని అమెరికాలో చేసిన ఓ సర్వేలో తేలింది.
పెద్ద వయసు వారిలో..
50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వాళ్లు కరోనా బారిన పడితే దాదాపు 50 శాతం మంది 2 వారాల్లోనే కోలుకుంటున్నారు. వీరిలో ఆస్పత్రిపాలు అయిన వారిలో 87 శాతం మంది కోలుకోవడానికి దాదాపు 2 నెలలు పడుతుందని పరిశోధుకులు గుర్తించారు. వీరికి నీరసం, శ్వాస సరిగ్గా అందకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు. ఇంకొంత మందిలో 3 నుంచి 4 నెలల పాటు కూడా దగ్గు రావడం, శ్వాసపరమైన ఇబ్బందులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు షికాగో వైద్యులు తెలిపారు.