కరోనా బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ నుంచి కోలుకుంటున్న వారిలోనూ ఇతర సమస్యలు తలెత్తుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ మహమ్మారిని శ్వాసకోశ ప్రభావిత వైరస్‌గా చెప్పుకుంటున్నప్పటికీ.. నేరుగా గుండె కండరాలకు సోకుతుందని, గుండె దెబ్బతినడానికి దారితీసే ఇతర సమస్యలను కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఊపిరితిత్తుల పనితీరుపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల గుండెకు సరిపడా ఆక్సిజన్ అందదు. అంతేకాదు గుండె లోపల కణాల్లో ప్రతి చర్యలు జరిగి మంటపుడుతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశముంటుంది. ఈ వైరస్ రక్త నాళాలపైనా దాడి చేస్తుంది. ఫలితంగా నాళాల్లో రక్తం గడ్డకట్టి గుండెనొప్పికి దారితీసే ప్రమాదం ఉంది. చాలా మంది కొవిడ్-19 రోగుల్లో శరీరం మొత్తం రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు వైద్యులు. అయితే.. దీనిపై వైద్యుల్లో ఏకాభిప్రాయం లేకపోయినప్పటికీ కొందరు వైద్యులు రక్తం గడ్డకట్టకుండా ఉంచే చికిత్సలు కూడా చేపట్టారు.
"గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా వైరస్‌తో ప్రమాదం అధికం. ఎలాంటి వ్యాధులు లేని కరోనా రోగుల్లోనూ గుండె సంబంధిత సమస్యలను గుర్తించాం."