ఆ పాప పేరు ఎమిలియా. వయసు 4 ఏళ్లు. ఇంట్లో తన పెంపుడు శునకాలతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఇల్లంతా తిరుగుతోంది. ఇంతలో కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు కన్పించాయి. ఆ సమయంలో అమ్మ పెరట్లో ఉంది. నాన్న బాత్రూంలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియక భయపడిపోయిన ఆ చిన్నారి పరుగున బాత్రూం వద్దకు వెళ్లింది. 'డాడీ.. ఫైర్' అంటూ తలుపులు బాదింది. దీంతో ఆ తండ్రి కిచెన్‌లోకి వచ్చి చూడగా ఎయిర్ ఫ్రయర్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే ఆయన ఆ ఎయిర్‌ఫ్రయర్‌ను తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేశారు. మంటలను ఆర్పేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ చిన్నారి అప్రమత్తతే వారి కుటుంబాన్ని కాపాడింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన.
ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోలను పాప తండ్రి డేనియల్ పాట్రిక్ జెర్మిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. "ఈ రోజు నా కూతురే మా ఇంటిని కాపాడింది. ఎయిర్‌ఫ్రయర్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్పుడు ఎమిలియా ఒక్కతే అక్కడ ఉంది. వెంటనే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. బ్యాగ్రౌండ్‌లో పాటల శబ్దాలు ఉన్నప్పటికీ తన మంటలను గుర్తించి నన్ను అప్రమత్తం చేసింది. నిజంగా ఎమిలియా రియల్ హీరో" అంటూ తన గారాలపట్టికి ధన్యవాదాలు చెప్పాడా తండ్రి.