కొవిడ్-19కు కారణమవుతున్న వైరస్‌ను 'పట్టుకుని చంపేసే' సామర్థ్యమున్న గాలి శుద్ధీకరణ యంత్రాన్ని(ఎయిర్ ఫిల్టర్) రూపొందించినట్లు హూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన బృందం వెల్లడించింది. ఈ యంత్రం గాలిలోని వైరస్‌ను సంగ్రంహించి వెంటనే నిర్వీర్యం చేస్తుందని వారు తెలిపారు. హూస్టన్ విశ్వవిద్యాలయంలోని టెక్సాస్ సెంటర్ ఫర్ సూపర్‌కండక్టివిటీ సంస్థ డైరెక్టర్ ఝిఫెంగ్ రెన్, హూస్టన్‌కు చెందిన వైద్య సంస్థ మెడిస్టార్ సీఈవో మొంఝెర్ హౌరానితో పాటు మరికొందరు పరిశోధకులు ఈ యంత్రం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన పత్రాన్ని 'మెటీరియల్స్ టుడే ఫిజిక్స్'లో ప్రచురించారు. అందులోని ముఖ్య వివరాలివీ.
- ఈ యంత్రంలోకి గాలి ప్రవేశించినప్పుడు అందులో కొవిడ్-19కు కారణమవుతున్న సార్స్-కొవ్-2ను 99.8 శాతం వరకూ సంహరిస్తోందని గల్వేస్టన్ నేషనల్ ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఆంత్రాక్స్ వ్యాధికి కారణమైన బసిల్లస్ బ్యాక్టీరియా మూలాలను కూడా ఈ యంత్రం 99.9 శాతం వరకూ అంతమొందిస్తోందని వెల్లడైంది.
- గాలిలో వైరస్ 3 గంటలకు పైగా జీవించి ఉన్నట్లు తేలిందని, అందుకే దాన్ని గాల్లోనే సాధ్యమైనంత త్వరగా చంపేసే వ్యూహంతో ఈ యంత్రానికి రూపకల్పన చేశామని పరిశోధకులు చెప్పారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వ్యాపార కార్యకలాపాలు పెరుగుతుండటంతో ఎయిర్ కండిషన్ ఉన్న గదుల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం అత్యంత అవసరమని వారు తెలిపారు.
- విద్యాసంస్థలు, కార్యాలయాలు, విమానాశ్రయాలు, విమానాలు, క్రూజ్ ఓడలు లాంటి జనసమ్మర్ద ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇది ఉపకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. కార్యాలయాల్లో వాడటానికి అనువుగా డెస్క్‌టాప్ మోడల్ ఎయిర్ ఫిల్టర్‌ను తయారుచేసే ఆలోచన ఉన్నట్లు మెడిస్టార్ సంస్థ తెలిపింది.
- మార్కెట్లో లభించే నికెల్ ఫోమ్‌ను 200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే ప్రక్రియ ద్వారా ఈ పరికరం పనిచేస్తుందని తెలిపారు. 70 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా 158 డిగ్రీల ఫారెన్‌హీట్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వైరస్ బతకదని తేలిందని, అందుకే అతి ఎక్కువ ఉష్ణోగ్రతతో ఉండే ఫిల్టర్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు మెడిస్టార్ తెలిపింది.
- ఎలక్ట్రికల్ పద్ధతిలో వేడి చేసేలా ఈ ఫిల్టర్‌ను రూపొందించామని, తద్వారా ఈ యంత్రం నుంచి బయటకు వెళ్లే వేడి శాతాన్ని సాధ్యమైనంత తగ్గించామని తెలిపారు. దానివల్ల ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.
- ఈ పరికరాన్ని తొలి దశలో అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు పనిచేసే ప్రదేశాల్లో వినియోగిస్తామని, తద్వారా వారు కరోనా బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తామని చెప్పారు. ఈ యంత్రం ద్వారా అత్యవసర విభాగాల ఉద్యోగులకు భద్రత పెరుగుతుందని, ఇతర ఉద్యోగులూ తమ పని ప్రదేశాలకు తిరిగి వచ్చేందుకు సహకరిస్తుందని తెలిపారు.