తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​పై అభిశంసన తీర్మానం

మరికొద్ది రోజుల్లో శ్వేతసౌధాన్ని వీడనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను, ముందుగానే పదవీచ్యుతుణ్ని చేసేందుకు డెమోక్రటిక్‌ పార్టీ వరుస వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ట్రంప్‌పై అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఇటీవల అమెరికా పార్లమెంటరీ భవనమైన క్యాపిటల్‌ హిల్‌పై ఆయన మద్దతుదారులు దాడులు చేసి, దేశ ప్రతిష్ఠను దిగజార్చిన నేపథ్యంలోనే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.

House Democrats introduce impeachment resolution, charging Trump with 'incitement of insurrection'
డొనాల్డ్​ ట్రంప్​పై అభిశంసన తీర్మానం

By

Published : Jan 11, 2021, 11:10 PM IST

Updated : Jan 12, 2021, 3:48 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్లు అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. క్యాపిటల్ భవనంలో ఘర్షణలకు దారితీసేలా ఆందోళనకారులను ప్రేరేపించినందుకు ఆయనను పదవి నుంచి తప్పించాలని ప్రతినిధుల సభలో ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. క్యాపిటల్‌ భవనంపై దాడి నేపథ్యంలో అధ్యక్ష పదవికి ట్రంప్‌ ఆమోదయోగ్యుడు కాదని 4 పేజీల తీర్మానంలో డెమొక్రాట్లు పేర్కొన్నారు. ట్రంప్‌ను పదవిలో కొనసాగిస్తే జాతీయ భద్రతకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు తప్పదని హెచ్చరించారు. శాంతియుతంగా జరగాల్సిన అధికార బదిలీ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.

అడ్డుకున్న రిపబ్లికన్లు..

మొదట 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను తొలగించేలా, ఏకగ్రీవ అంగీకారం కోసం కేబినెట్‌ను సమీకరించాలని ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ను కాంగ్రెస్‌ సభ్యుడు జమీ రస్కిన్ కోరారు. అందుకు రిపబ్లికన్‌ సభ్యులు అడ్డుపడ్డారు. అయితే 25వ సవరణ అధికారాన్ని ఉపయోగించి ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసే విషయమై ఉపాధ్యక్షుడు పెన్స్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు జమీ రస్కిన్, డేవిడ్ సిసిలైన్, టెడ్ లియూలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి 211 మంది మద్దతు తెలిపారు.

పదవీకాలం ముగియటానికి ముందే ట్రంప్‌ను ఎలాగైనా పదవీచ్యుతుడిని చేయాల్సిందేనని ప్రతినిధులసభ స్పీకర్ నాన్సీ పెలోసీ పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో కొన్నిరోజులుగా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. సోమవారం సభలో అభిశంసన ప్రక్రియను మొదలుపెట్టాలంటూ ఆదివారమే సభ్యులకు లేఖ రాసిన ఆమె.. అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ట్రంప్ ముప్పుగా పరిణమించారని ఆరోపించారు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆయన ప్రేరేపిస్తున్న హింస తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను తొలగించకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరించారు. మొదట ట్రంప్ తానంతట తానుగా పదవికి రాజీనామా చేసేలా రిపబ్లికన్ సభ్యులపై ఒత్తిడి తేవాలని పెలోసీ భావించారు. అలా కానిపక్షంలో 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేలా ఉపాధ్యక్షుడిని కోరాలని యోచించారు. కేబినెట్ సభ్యులతో కలిసి ట్రంప్‌ను తొలగించేందుకు పెన్స్ నిరాకరించినా.. ప్రతినిధుల సభలోనే ఆభిశంసన ప్రక్రియను మొదలుపెడతామని పేలోసీ తేల్చి చెప్పారు. ఈ అభిశంసన తీర్మానంపై బుధవారంనాటికి సభలో ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తున్నారు. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు.

ఇదీ చూడండి: క్యాపిటల్​పై దాడిని ఖండిస్తూ దౌత్య అధికారుల తీర్మానం

Last Updated : Jan 12, 2021, 3:48 AM IST

ABOUT THE AUTHOR

...view details