అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుగా సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం తాలిబన్లు ఒక అడుగు ముందుకేశారు. కాల్పుల విరమణ ఎంతకాలమన్న విషయమై స్పష్టత లేదు. కనీసం 10 రోజులపాటు తుపాకులు మోగబోవని తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి. 2018 జూన్‌లో రంజాన్ సందర్భంగా మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటించారు. ఈసారి ఈ గడువు పెంచడం ఒకింత ఊరట కలిగించే అంశం. అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడం, అఫ్గాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తిపలకడం శాంతి ఒప్పందం లక్ష్యం.
నష్టపోయిన అమెరికా
ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే లక్ష్యంతో 18 ఏళ్ల క్రితం అమెరికా సైన్యం అఫ్గాన్‌లో అడుగుపెట్టింది. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా తీవ్రరూపం దాల్చింది. ఏళ్ల తరబడి సైన్యం కొనసాగింపు వల్ల అమెరికా ఆర్థికంగా, సైనికపరంగా నష్టపోయింది. ఉగ్రదాడుల్లో అనేకమంది సైనికులూ హతులయ్యారు. దీంతో ఈ యుద్ధం అసలు ఎవరి కోసమన్న అంతర్మథనం ప్రారంభమైంది. దళాల ఉపసంహరణకు ఒబామా హయాములోనే ప్రయత్నాలు జరిగినప్పటికీ కొలిక్కిరాలేదు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అఫ్గాన్ నుంచి దళాల ఉపసంహరణను తన ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేకంగా ప్రకటించారు. అయితే పదవీకాలం ముగుస్తున్నా ఆ దిశగా విజయవంతం కాలేకపోయారు.
గందరగోళ పరిస్థితుల తర్వాత...
2018 సెప్టెంబరులో కతార్ రాజధాని దోహా నగరంలో తాలిబన్లతో శాంతి చర్చలను ట్రంప్ అర్ధంతరంగా నిలిపేశారు. అసలు చర్చించడానికి అంశమంటూ ఏమీ లేదని ప్రకటించి గందరగోళం సృష్టించారు. ఆపై నవంబరు నెలాఖరులో ఆకస్మికంగా అఫ్గానిస్థాన్ వెళ్లిన ట్రంప్ మళ్ళీ చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు నిరుడు నవంబరు మొదటివారంలో జరిగిన చర్చల్లో తాత్కాలికంగా అయినా కాల్పుల విరమణ పాటించాలని అమెరికా పిలుపిచ్చింది. దీనికి స్పందనే తాలిబన్ల తాజా ప్రకటన!
పైకి చెప్పనప్పటికీ అఫ్గాన్‌లో జోక్యంతో అమెరికాకు తలబొప్పి కట్టింది. దీంతో ఏదో ఒక పేరుతో వీలైనంత త్వరగా తట్టాబుట్టా సర్దుకుని అక్కడి నుంచి నిష్క్రమించాలన్న ఆలోచనతో అగ్రరాజ్యం ఉంది. ప్రస్తుతం 12వేల మంది అమెరికా సైనికులు అఫ్గాన్‌లో ఉన్నట్లు అంచనా. ఒప్పందం కుదిరితే వీరు వెనక్కు వెళ్లిపోతారు. తాలిబన్లకు కావలసిందీ అదే. అంతర్యుద్ధానికి తెరదించేందుకు అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ ప్రయత్నించారు. తాలిబన్ల డిమాండ్లపై ఓ మెట్టు దిగేందుకూ ఆయన సిద్ధపడ్డారు. అయితే ఎన్నికలు వద్దన్న తాలిబన్ల డిమాండ్లను తిరస్కరించారు.
అమాయక పౌరులు బలి...
ఏళ్ల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంతో అఫ్గానిస్థాన్ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ప్రజల ప్రాణాలకు పూచిక పుల్లపాటి విలువ లేకుండా పోయింది. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య దాడుల్లో అమాయక పౌరులు హతులవుతున్నారు. కొన్ని సందర్భాల్లో భద్రతాదళాలు సైతం బలవుతున్నాయి. అంతర్యుద్ధం ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. నిత్యావసర సరకుల ధరలు నింగినంటాయి. దీంతో ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. మరోపక్క విద్యారంగం ఉసూరుమంటోంది.
నిత్యం ఘర్షణల కారణంగా బాల్యం విద్యకు దూరమవుతోంది. పదేళ్ల అంతర్యుద్ధంలో లక్షమంది పౌరులు మరణించడమో, లేదా తీవ్ర గాయాల పాలవడమో జరిగింది. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన అధికారిక సమాచారమిది. సగటున దేశంలో రోజుకు వంద మంది మరణించడమో, గాయపడటమో జరుగుతోంది.