అద్భుత గ్రాఫిక్స్, కళ్లు చెదిరే విజువల్స్‌తో పాటు అదిరిపోయే కార్ల ప్రదర్శనకు అడ్డా హాలీవుడ్. ఎంతో మందికి హాలీవుడ్ చిత్రాలు చూడటం వల్లే కార్లపై మోజు పెరిగిందనడంలో సందేహం లేదు. తమ అభిమాన హీరో అత్యాధునిక వాహనాలపై దూసుకుపోయే సన్నివేశాలకు థియేటర్లలో ఈలలు పడటం ఖాయం. అలాంటి హాలీవుడ్ ప్రముఖ చిత్రాల్లోని కార్లన్నీ ఒక్క చోట చేరితే?
అమెరికా లాస్ ఏంజెలస్‌లో 'హాలీవుడ్ డ్రీమ్ మెషీన్స్' పేరుతో పీటర్సన్ ఆటోమొబైల్ మ్యూజియంలో కార్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు. బ్లేడ్ రన్నర్, డెత్ రేస్, టెర్మినేటర్, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్, బ్లాక్ పాంతర్ సహా 40 హాలీవుడ్ సినిమాల్లో ఉపయోగించిన వాహనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిన 'బంబల్ బీ'తో పాటు స్టార్ వార్స్‌లోని స్పేస్ షిప్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ డ్రీమ్ మెషీన్స్ ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉందని వాహన రంగ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు.