ట్రంప్ అభిశంసనపై సెనేట్‌లో విచారణ ప్రారంభం అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవిలో ఉంచాలా? లేదా? అనే విషయమై సెనేట్‌లో విచారణ ప్రారంభమైంది. ట్రంప్ అభిశంసనపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేశారు ప్రతినిధులు.
అమెరికా అధ్యక్షునిపై సెనేట్‌లో విచారణ జరగడం ఆ దేశ చరిత్రలో ఇది మూడోసారి. ట్రంప్‌పై విచారణకు ముందు అభిశంసనకు సంబంధించిన ఆర్టికల్స్‌ను సెనేట్‌లో చదివి వినిపించారు. మొత్తం 100 మంది ప్రతినిధులున్న సెనేట్‌లో 99మంది హాజరుకాగా.. ఒక్కరు గైర్హాజరయ్యారు.
'అధ్యక్ష ఎన్నికల్లో ప్రయోజనం కోసమే'
అభిశంసన ప్రక్రియను నెలల తరబడి కొనసాగించడాన్ని ఎగతాళి చేశారు ట్రంప్. విచారణకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఆరోపణలన్నీ బూటకమని వ్యాఖ్యానించారు. డెమోక్రాట్లు కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేసి ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు ట్రంప్.
ట్రంప్ అభిశంసనకు దిగువ సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న ఎగువ సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదు. ఇందుకు మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.
ఇదీ చూడండి: 6 రోజులు మంచులోనే వృద్ధురాలు- బతికి బయట పడిందిలా..