తెలంగాణ

telangana

ETV Bharat / international

రివ్యూ 2019: నరమేధం నుంచి నోబెల్​ శాంతి బహుమతి వరకు - 2019 YEAR END STORIES

2019లో ప్రపంచ దేశాలు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఆగ్రహం, ఆవేదన, బాధతో పాటు భావోద్వేగ క్షణాల కలయికగా 2019 నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ప్రధానంగా నిలిచిన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.

highlights-around-the-globe-of-2019
రివ్యూ 2019: నరమేథంతో మొదలై శాంతి బహుమతి వరకు

By

Published : Dec 28, 2019, 7:03 AM IST

రివ్యూ 2019: నరమేథం నుంచి నోబెల్​ శాంతి బహుమతి వరకు

శ్రీలంక ఈస్టర్​ సండే నరమేధం నుంచి హాం​కాంగ్​ నిరసనల వరకు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసన నుంచి బ్రిటన్​ 'బ్రెగ్జిట్​' ఎన్నికల వరకు.. 2019లో ప్రపంచదేశాలు ఎన్నో ఒడిదొడుకులకు గురయ్యాయి. ఈ ఏడాది అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సంచలనాలు, ఉద్వేగ క్షణాలు, భావోద్వేగాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

ఈస్టర్​ సండే మారణహోమం..

2019 ఏప్రిల్​ 21 ఆదివారం.. శ్రీలంక ప్రజలు ఈస్టర్​ సండే ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో వరుస పేలుళ్లు సృష్టించిన అలజడిని ఆ దేశం ఎన్నటికీ మర్చిపోదు. మూడు చర్చీలు, విలాసవంతమైన హోటళ్లే లక్ష్యంగా 9 మంది ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ నరమేథంలో 259 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఐసిస్​ ప్రకటన విడుదల చేసింది. కానీ ఈ మారణహోమం వెనుక స్థానిక ఇస్లామిక్​ తీవ్రవాద బృందం 'జాతీయ థైవీడ్​ జమాత్​' హస్తం ఉందని శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. ఈస్టర్​ సండే ఘటనలో ఇప్పటి వరకు 300 మందిని అదుపులోకి తీసుకున్నారు.

భగ్గుమన్న హాం​కాంగ్​..

నిరసనలతో హాం​కాంగ్​ ఉక్కిరిబిక్కిరవుతోంది. విచారణ పేరుతో తమ పౌరులను చైనాకు అప్పగించేందుకు ప్రభుత్వం తలపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్​ వాసులు ఈ ఏడాది జూన్​ నుంచి ఆందోళనలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇవి హింసాత్మకంగా మారాయి. నిరసనకారుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. బిల్లును తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అయినా ఆ దేశ ప్రజల ఆగ్రహం తగ్గలేదు. బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

కెనడా ఎన్నికలు...

ఆక్టోబర్​ 1న జరిగిన కెనడా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. సాధారణ ఎన్నికల్లో ప్రధాని జస్టిన్​ ట్రూడో విజయం సాధించినప్పటికీ.. భారత సంతతి కెనడియన్ జగ్మీత్​ సింగ్​ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్​ పార్టీ(ఎన్​డీపీ) 24 సీట్లు గెలిచి కింగ్​ మేకర్​గా ఆవిర్భవించింది. ఈ ఎన్నిల్లో మొత్తం 50 మంది భారత సంతతి అభ్యర్థులు పోటీపడగా.. 19 మంది గెలిచారు. వీరిలో 18 మంది పంజాబీలే కావడం విశేషం.

బ్రిటన్​ 'బ్రెగ్జిట్​' ​ఎన్నికలు...

డిసెంబర్​లో జరిగిన బ్రిటన్​ ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అందుకు కారణం 'బ్రెగ్జిట్​.' ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలగాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన ప్రధాని బోరిస్​ జాన్సన్​ నేతృత్వంలోని కన్జర్వేటివ్​ పార్టీ... భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారత సంతతి ఎంపీలు రికార్డు స్థాయిలో గెలుపొంది పార్లమెంట్​కు చేరుకున్నారు. ఇక మిగిలింది బ్రెగ్జిట్​ మాత్రమే.

గ్రెటా థెన్​బర్గ్​...

పెరుగుతున్న భూతాపం, రోజురోజుకు నాశనమవుతున్న పర్యావరణంపై ప్రపంచవ్యాప్తంగా ఆవేదన నెలకొంది. ఈ తరుణంలో పర్యావరణ పరిరక్షణకు కదం తొక్కిన స్వీడన్​ దేశస్థురాలు గ్రెటా థెన్​బర్గ్​.. కోట్లాదిమంది యువతకు స్ఫూర్తినిచ్చింది. నిరసనలతో ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ నేతలకే సవాళ్లు విసురుతోంది గ్రెటా. ఈ యువ పర్యావరణవేత్తను ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి.

పర్యావరణ మార్పుపై పోరాటం...

గ్రెటా థెన్​బర్గ్​ స్ఫూర్తితో.. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పుపై నిరసనలు తారస్థాయికి చేరాయి. సెప్టెంబర్​ 20-27 మధ్య జరిగిన ఆందోళనల్లో లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చి పోరాటం చేశారు. మీడియా కథనాల ప్రకారం 150 దేశాల్లోని 4,500 ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ప్రపంచంలో పర్యావరణంపై జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.

ఆరాంకోపై దాడి...

సౌదీ అరేబియాలో.. సెప్టెంబర్​ 14న ఆరాంకో సంస్థ, నిర్వహిస్తోన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత ఈ కేంద్రం కొద్ది నెలలు మూతపడింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. ఈ దాడికి బాధ్యత తమదేనని హౌతీ రెబల్​ బృందం ప్రకటించింది. కానీ ఈ ఘటన వెనుక ఇరాన్​ హస్తం ఉందని అమెరికా ఆరోపించింది.

ముగాబే మరణం...

జింబాబ్వేకు సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా వ్యవహరించిన రాబర్ట్​ ముగాబే సెప్టెంబర్​ 6న కన్నుమూశారు. 95 ఏళ్ల ముగాబే 1980 నుంచి 2017 వరకు దేశాధ్యక్షుడిగా సుదీర్ఘ సేవలందించారు. 2017లో సైనిక స్వాధీనంతో అధ్యక్ష పదవి కోల్పోయారాయన.

నోబెల్​ శాంతి పురస్కారం...

నోబెల్ శాంతి పురస్కారం-2019ని ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్​ అలీ అందుకున్నారు. తన పొరుగు దేశం ఎరిట్రియాతో శాంతిని నెలకొల్పేందుకు చేసిన కృషికి అబీ అహ్మద్​ను ఈ అవార్డు వరించింది.

భారతీయుడికి 'ఆర్థిక' నోబెల్​

ప్రపంచవ్యాప్తంగా పేదరికంపై పోరాటానికి అనుసరించాల్సిన అత్యుత్తమ మార్గాలేమిటో తెలుసుకొనేలా సరికొత్త విశ్వసనీయ విధానాల్ని పరిచయం చేసిన ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ​ ఆర్థిక శాస్త్రంలో నోబెల్​ పురస్కారాన్ని అందుకున్నారు. అభిజిత్​తో పాటు ఆయన సతీమణి ఈస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమర్‌లకూ ఈ అవార్డు వరించింది.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు...

నవంబర్​ 16న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈస్టర్​ సండే మారణహోమం నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. అధ్యక్షుడి బరిలో రికార్డు స్థాయిలో 36 మంది పోటీపడగా.. మాజీ రక్షణమంత్రి గొటాబయ రాజపక్స విజయం సాధించారు. అయితే రాజపక్స చైనా మద్దతుదారుడని.. భాజపా వ్యతిరేకి అని పేరుంది. కానీ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం తొలి విదేశీ పర్యటనగా ఆయన భారత్​కు రావడం విశేషం.

ట్రంప్​ అభిశంసన...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభింశసన విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన రెండు తీర్మానాలను ప్రతినిధుల సభ ఆమోదించింది. తదుపరి ఆమోదానికై ఈ తీర్మానాలు సెనేట్​ ముందుకు వెళ్లనున్నాయి. అయితే సెనేట్​లో రిపబ్లికన్​ పార్టీ అధిపత్యం ఎక్కువ ఉండటం వల్ల ఈ తీర్మానం ఆమోదం పొందడం అసాధ్యం.

అయితే అమెరికా అధ్యక్షుడిపై దిగువ సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందడం ఆ దేశ చరిత్రలో ఇది మూడోసారి. 1868లో ఆండ్రూ జాన్సన్​పై, 1998లో బిల్​ క్లింటన్​పై దిగువసభలో అభిశంసన తీర్మానాలు ఆమోదం పొందాయి. అయితే ఎగువ సభలో మాత్రం వీగిపోయాయి. వీరిద్దరి తర్వాత అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది అధ్యక్షుడు ట్రంప్​పైనే.

ABOUT THE AUTHOR

...view details