ఊబకాయస్థులు, పరిమితికి మించి ఎక్కువ బరువు ఉన్న వారికి కొవిడ్-19తో ఎక్కువ ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఎక్కువ బరువు ఉన్న కరోనా బాధితులే అధికంగా ఐసీయూల్లో చేరుతున్నట్లు లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన కథనం పేర్కొంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)కు, కరోనా ప్రమాద తీవ్రతకు సంబంధం ఉందా అన్న కోణంలో భారీఎత్తున పరిశోధన చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు జర్నల్ పేర్కొంది.
పరిశోధనల్లోని వివరాలిలా..
ఇంగ్లండ్‌లో ఉన్న 20 వేల మంది కొవిడ్ రోగులు సహా 69 లక్షల మంది ప్రజలకి సంబంధించిన సమాచారం సేకరించి ఈ పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. వారిలో కొందరు మృత్యువాతపడగా.. మరికొందరు ఐసీయూలో చికిత్స పొందినట్లు యూకే పరిశోధకులు తెలిపారు. బీఎంఐ విలువ 23 కంటే ఎక్కువ ఉన్నవారికి కొవిడ్ ముప్పు ఉంటున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ఒక్కో యూనిట్ బీఎంఐ పెరిగే కొలదీ 5 నుంచి 10 శాతం ముప్పు పెరుగుతుందని చెప్పారు. బీఎంఐ విలువ 18.5 కంటే తక్కువగా ఉన్నవారు కూడా ముప్పును ఎదుర్కొన్నప్పటికీ.. అలాంటి కేసులు తక్కువేనని ఊబకాయులకే ప్రమాదం ఎక్కువని సర్వే పేర్కొంది. ఎక్కువ బరువున్న వారిలో 20 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న వారికి ముప్పు అధికమని.. 60 ఏళ్లు పైబడిన వారిలో మాత్రం కాస్త తక్కువని పరిశోధకులు తెలిపారు. 40 ఏళ్లలోపు ఊబకాయులకే ప్రమాద తీవ్రత ఎక్కువని 80 ఏళ్లు పైబడిన వారిలో మాత్రం బీఎంఐ పెరిగినప్పటికీ ముప్పు తీవ్రత తక్కువగా ఉంటోందని పరిశోధకులు వివరించారు.