ఎన్-95 మాస్కుల వినియోగంపై పరిశోధనలు చేసి.. కీలక విషయాలు వెల్లడించింది అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ. ఈ మాస్కులను తిరిగి ఉపయోగించేందుకు.. వేడి చేయడమే ఉత్తమ మార్గమని పరిశోధకులు తేల్చారు. ఇలా వేడిచేయడం వల్ల క్రిమిరహితమై దాదాపు 50 సార్లు తిరిగి ఉపయోగించేందుకు వీలుగా ఉంటాయని చెప్పారు.
85 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద.. 20 నిమిషాలు వేడి చేస్తే ఎన్-95 మాస్కులు క్రిమిరహితం అవుతాయని వివరించారు. మాస్క్ సామర్థ్యం ఏ మాత్రం తగ్గదని స్పష్టం చేశారు.
ఒక్క మాస్కునే మళ్లీ మళ్లీ..
కరోనా నివారణ చర్యల్లో భాగంగా మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. ముఖ్యంగా వైరస్ బాధితులను పర్యవేక్షించే వైద్యులు ఎన్-95 మాస్కులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే.. వీటి కొరత కారణంగా ఒక్క మాస్కునే మళ్లీ మళ్లీ వాడాల్సి వస్తోంది. మాస్కులను క్రిమిరహితం చేసే ఉత్తమమైన పద్దతి ఇప్పటి వరకు లేకపోవడం సమస్యగా మారింది. దీనిపై విస్తృత పరిశోధనలు చేపట్టిన స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తలు.. వేడి చేసే విధానాన్ని సిఫార్సు చేశారు.
మరికొన్ని పద్దతులను కూడా పరిశోధకులు సిఫార్సు చేశారు. యూవీ రేడియేషన్, బ్లీచింగ్ వల్ల కూడా మాస్కులు క్రిమిరహితం అవుతాయని వివరించారు. అయితే తరచుగా మాస్క్‌లను విప్పి పెట్టుకోవడం వల్ల ఎన్-95 సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు.