కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద ఇప్పటికే 35 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వ్యాక్సిన్ పంపిణీకి ఆయా దేశాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వ్యాక్సిన్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు దేశాధినేతలు, ప్రముఖులు తొలుత వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు ఇలా తీసుకున్న వారిలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి నేతలు వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకొని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
జో బైడెన్, కమలా హారిస్..
ఫైజర్ తయారుచేసిన వ్యాక్సిన్ తొలిసారిగా బ్రిటన్‌లో అనుమతి పొందిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికా ఈ వ్యాక్సిన్ ఉపయోగానికి ఆమోదం తెలిపింది. ఈ సమయంలో అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, కమలా హారిస్ బహిరంగంగానే వ్యాక్సిన్ తీసుకున్నారు. మహమ్మారిపై పోరులో శాస్త్రవేత్తలు ఎంతో కృషి ఫలితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయమని, ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వీరితో పాటు అమెరికా అంటువ్యాధులు నిపుణులు ఆంటోనీ ఫౌచీ కూడా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా ముందున్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా తీసుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటికే కొవిడ్ నుంచి కోలుకున్న కారణంగా వైద్యుల సూచనల మేరకు తీసుకుంటానని ట్రంప్ ప్రకటించారు. వీరితోపాటు వైట్‌హౌస్ సిబ్బంది, రాష్ట్రాల గవర్నర్లు వ్యాక్సిన్‌ను బహిరంగంగానే తీసుకుంటున్నారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి వంటి ప్రముఖులు కూడా వ్యాక్సిన్‌ను అందరిముందే తీసుకున్నారు.
అదేబాటలో ఇజ్రాయెల్ ప్రధాని..
కరోనా వ్యాక్సిన్‌పై ముమ్మర ప్రచారం కల్పించడంలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వ్యాక్సిన్‌ను బహింరంగంగానే తీసుకున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా చేపడుతున్నారు. ఇప్పటికే అక్కడి జనాభాలో 12శాతం మందికి వ్యాక్సిన్ అందించారు.