కరోనా చికిత్సలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు అజిత్రోమైసిన్ మాత్రలను ఒకేసారి వాడడం వల్ల హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒక్కోసారి వీటివల్ల ప్రాణాలకే ప్రమాదం పొంచివుందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే స్వల్పకాలిక కోర్సులో భాగంగా హెచ్సీక్యూ 30 రోజుల పాటు వాడితే ఎలాంటి ప్రమాదం లేదని, దీర్ఘకాలికంగా వాడితేనే హృద్రోగ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీర్ఘకాలికంగా హెచ్సీక్యూ వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఏప్రిల్‌లోనే యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ(ఈఎంఏ) కూడా హెచ్చరించింది.
మరింత పరిశోధనలు జరిపిన అనంతరం మరో నివేదిక దీన్ని స్పష్టం చేసింది. తాజాగా ఈ పరిశోధన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ రూమటాలజీ, MedRxivలోనూ ప్రచురితమైంది.
పరిశోధనలు జరగాల్సి ఉన్నా..
కరోనావైరస్ విజృంభిస్తోన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు ఉపయోగించే హెచ్సీక్యూ నియంత్రిస్తోన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా ఈ మందుల వాడకం పెరిగింది. దీనిపై విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉందని అంతర్జాతీయ నిపుణులు ఇప్పటికే సూచించారు. ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, 30 రోజుల స్వల్పకాలిక కోర్సు వల్ల ప్రమాదమేమీ లేదని తేలింది.