కరోనాపై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటానన్న భారత్.. తన మాట నిలబెట్టుకుంది. అమెరికా, బ్రిటన్లకు ఔషధాలను ఎగుమతి చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటితో పాటు ఈ డ్రగ్ ఉత్పత్తిలో వినియోగించే ముడిపదార్థాలనూ ఆ దేశానికి పంపించింది.
"కొవిడ్-19పై చేస్తున్న పోరాటంలో భాగస్వామ్య దేశాలకు చేయూతనివ్వడంలో భాగంగా భారత్ పంపించిన హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకున్నాయి."-తరణ్జిత్ సింగ్ సంధూ, అమెరికాలోని భారత రాయబారి
గత వారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో సంభాషణలో భాగంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేయాలని కోరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
బ్రిటన్కు పారాసిటమాల్
బ్రిటన్కు సైతం భారత్ సహాయంగా ఔషధాలను ఎగుమతి చేసింది. భారత్ పంపిన 30 లక్షల పారాసిటమాల్ ప్యాకెట్లు నేడు బ్రిటన్కు చేరుకోనున్నాయి. ఈ సహాయానికిగానూ ఆ దేశ విదేశాంగ(దక్షిణాసియా వ్యవహారాలు) సహాయ మంత్రి తారిక్ అహ్మద్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు తమ సహకారాన్ని కొనసాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్లోనే అధికంగా లభ్యం
ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైడ్రాక్సీక్లోరోక్విన్ భారత్ నుంచే అధికంగా(70శాతం) ఉత్పత్తి అవుతోంది. దేశీయ అవసరాల నిమిత్తం కొవిడ్ చికిత్సలో ఉపయోగించే ఈ డ్రగ్ ఎగుమతులపై భారత్ మొదట నిషేధం విధించింది. వివిధ దేశాల అభ్యర్థనతో పాటు దేశంలో డ్రగ్ నిల్వలు సరిపడా ఉండటం వల్ల ఈ నిషేధాన్ని ఏప్రిల్ 7న సడలించింది. ప్రపంచ దేశాలకు సహకారం అందించడానికి మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకుంది.