భారత్-అగ్రరాజ్యం మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధం వేగంగా వృద్ధి చెందుతోందని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. భారత వృద్ధిలో అమెరికా సహజ భాగస్వామిగా మారిపోయిందన్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితం సున్నాగా ఉన్న రక్షణ ఉత్తత్తుల కొనుగోలు బంధం నేడు 20బిలియన్ డాలర్లకు చేరిందని వెల్లడించారు. దీంతో అమెరికాకి భారత్ ప్రధాన రక్షణ భాగస్వామిగా మారిపోయిందన్నారు. ఇందులో భాగంగా అనేక సైనిక విన్యాసాలు, ఒప్పందాలు జరిగాయన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం
ఇక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఏడాదికి 10శాతం చొప్పున వృద్ధి చెందుతోందన్నారు. 2018 నాటికి ఇది 142 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. అలాగే ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాల్లో సమతుల్యత కూడా పెరిగిందన్నారు. అలాగే పెట్టుబడుల విషయంలోనూ ఉభయ దేశాలు మెరుగైన స్థాయికి చేరాయన్నారు. అమెరికాకి చెందిన 2000 కంపెనీలు భారత్‌లో వివిధ రంగాల్లో 40 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయన్నారు.
అదే సమయంలో భారత్‌కు చెందిన 200 కంపెనీలు యూఎస్ 18బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయన్నారు. దీంతో అక్కడ లక్ష మందికి ఉపాధి కలిగిందని పేర్కొన్నారు. ఇంధన, హెల్త్‌కేర్ టెక్నాలజీలోనూ గతకొన్నేళ్లలో ఇరు దేశాల మధ్య సహకారం పెరిగిందన్నారు. ఉభయ దేశాల్లో పలు సంస్థలు భాగస్వామ్యంగా ఏర్పడి అనేక వ్యాధులపై సుదీర్ఘకాలంగా పరిశోధనలు కొనసాగిస్తున్నాయన్నారు. టీకాల తయారీ, క్షయ నివారణ చికిత్స వంటి అంశాల్లో కృషి జరుగుతోందన్నారు.
ఇదీ చూడండి : 'చైనా దగ్గర చాలా ఉంది.. మళ్లీ అప్పు ఇవ్వడం ఎందుకు?'