డొమినికాలో అరెస్టయిన మెహుల్ ఛోక్సీని (mehul choksi) నేరుగా భారత్‌కే అప్పగించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అక్రమంగా డొమినికా(dominica)లోకి ప్రవేశించిన ఛోక్సీని నిర్బంధించాలని, అటు నుంచే అటు భారత్‌కు పంపేయాలని ఆంటిగ్వా ప్రధాని కోరినట్లు సమాచారం. ఆంటిగ్వా పౌరసత్వం ఉన్న ఛోక్సీ ప్రస్తుతం అక్కడ లేడు. డొమినికాలో అతడికి పౌరసత్వం లేదు. మరోవైపు అతడిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ నోటీసుల ద్వారా అతడిని నేరుగా భారత్‌కు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సినిమాను తలపించిన అరెస్టు(arrest)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు నిందితుడు మెహుల్ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం బాలీవుడ్(bollywood) సినిమాను తలపిస్తోంది. ఆంటిగ్వాలో గత ఆదివారం ఉన్నట్టుండి ఛోక్సీ అదృశ్యమయ్యాడు. దీంతో ఆ దేశ పోలీసులు సహా ఇంటర్‌పోల్ రంగంలోకి దిగింది. ఆయన కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఆంటిగ్వాకు పక్కనే ఉన్న చిన్న దేశం డొమినికాలోని ఓ బీచ్‌లో ఏవో పత్రాలు సముద్రంలోకి విసిరేస్తూ ఛోక్సీ పోలీసుకు చిక్కాడు.
2018 ఆరంభంలో పీఎన్‌బీ కుంభకోణం (pnb scam) వెలుగులోకి రాకముందే భారత్ నుంచి పారిపోయిన ఛోక్సీ.. అప్పటికే ఉన్న ఆంటిగ్వాలో పౌరసత్వం వినియోగించుకొని అక్కడే ఉంటున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఛోక్సీ ఆంటిగ్వాలో కనిపించకుండాపోవడం కలకలం రేపింది. గత ఆదివారం సాయంత్రం డిన్నర్ కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. దర్యాప్తులో భాగంగా జాలీ హార్బర్ ప్రాంతంలో ఆయన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఛోక్సీ సముద్రం మార్గం గుండా పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి ఆచూకీ కోసం ఆంటిగ్వా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడంతో ఎల్లో నోటీసు జారీ అయ్యింది.