హైతీలో శనివారం సంభవించిన భూకంపంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 304 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ దేశ పౌర రక్షణ శాఖ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. 1,800 మంది గాయపడగా.. మరికొందరు గల్లంతు అయినట్లు తెలుస్తోంది.
ఈ భూకంపం.. రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతగా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే చెప్పింది. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఈ సంస్థ అనంతరం ఉపసంహరించుకుంది. రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు 125 కి.మీల దూరంలో, దక్షిణ హైతీలోని సెయింట్ లూయిస్ డు సుడ్‌కు 12 కి.మీల దూరంలో, 10 కి.మీ లోతులో కేంద్రీకృతం అయినట్లు తెలిపింది. రాజధాని నగరం పోర్ట్-ఓ-ప్రిన్స్‌తో పాటు సమీప దేశాల్లో భూప్రకంపనలు వచ్చాయి.
నెల రోజు అత్యవసర పరిస్థితి
ఈ భూకంపం దేశంలోని పలు చోట్ల ప్రాణ, భారీ ఆస్తి నష్టాన్ని కలిగించినట్లు హైతీ కొత్త ప్రధాని ఏరియల్ హెన్రీ తెలిపారు. భూప్రకంపనల ధాటికి పలు చోట్ల భవనాలు, వేల ఇళ్లు కుప్పకూలాయి. ప్రజలు భయాందోళలతో రోడ్లపైకి పరుగులు తీశారు. గాయపడినవారిని విపత్తు, సహాయ బృందాలు సమీప ఆసుపత్రులకు తరలించాయి. నెలరోజుల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. బాధితులకు సహాయం చేసేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మృతులకు ప్రధాని సంతాపం తెలిపారు.