అమెరికాను జాత్యహంకారం చాలా కాలంగా విడదీసిందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు గురై మంగళవారం నాటికి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. బైడెన్ సహా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను శ్వేతసౌధంలో జార్జి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఆనందం, దుఃఖాన్ని వారు ఏకకాలంలో పంచుకున్నారు. జార్జి హత్యకు నివాళిగా.. జాత్యహంకారాలను అరికట్టేలా పోలీసింగ్ చట్టాన్ని తీసుకురావాలని వారు కోరారు.
జియాన్నాకు ఐస్‌క్రీం..
తన సోదరుడికి జరిగిన అన్యాయాన్ని గుర్తుంచుకునే రోజు ఇదేనని జార్జి సోదరుడు ఫిలోనైస్ ఫ్లాయిడ్ పేర్కొన్నారు. జార్జి వారసత్వాన్ని కాపాడే ఈ బిల్లు అర్థవంతంగా ఉండాలని బైడెన్ చెప్పారని జార్జి మేనల్లుడు బ్రాండన్ విలియమ్స్ తెలిపారు. తమ కుటుంబ బాగోగులను అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నారని వివరించారు. ఈ సమావేశంలో... జార్జి ఫ్లాయిడ్ చిన్న కుమార్తె జియాన్నాతో కాసేపు ఉల్లాసంగా గడిపారు బైడెన్. తనకు ఆకలిగా ఉందని జియాన్నా వెల్లడించగా.. ఆమె కోసం ఐస్‌క్రీమ్, స్నాక్స్‌ను తెప్పించారు. అనంతరం బైడెన్‌తో కలిసి జియాన్నా ఫొటోలు దిగింది. జార్జికి ఆయన కుటుంబ సభ్యులంతా నివాళులు అర్పించారు.