అమెరికాలో స్థిరపడాలనుకునే వారి కలలు సాకారం కావాలంటే చాలా కాలం నిరీక్షించే పరిస్థితి నెలకొంది. రోజులు నెలలు కాదు ఏకంగా వందల సంవత్సరాల పాటు ఈ నిరీక్షణ సాగనున్నట్లు తెలుస్తోంది.
ఓ భారతీయుడికి అమెరికాలో శాశ్వత నివాస హక్కు(గ్రీన్ కార్డ్) పొందడానికి పట్టేకాలం ఎంతో తెలుసా? ఏకంగా 195 సంవత్సరాలు. ఈ విషయాన్ని అమెరికన్ రిపబ్లికన్ సెనెటర్ వెల్లడించడం గమనార్హం.
ఈ సమస్యను పరిష్కరించడానికి శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తోటి సభ్యులను కోరారు రిపబ్లికన్ సెనెటర్ మైక్ లీ. ప్రస్తుతం ఉన్న గ్రీన్‌కార్డ్ విధానం వలసదారుల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం కలిగించడం లేదని మైక్ అభిప్రాయపడ్డారు.
"బ్యాక్‌లాగ్‌లో ప్రవేశించిన ఒక భారతీయ వ్యక్తి ఈబీ-3 గ్రీన్‌కార్డ్ సంపాదించాలనుకుంటే 195 సంవత్సరాలు వేచిచూడాల్సి ఉంటుంది. ఒకవేళ వారి పిల్లలకు ఇదే అనిశ్చితి వాతావరణం కల్పిస్తే అందులో ఒక్కరు కూడా అమెరికా పౌరులుగా మారే అవకాశం లేదు."
-మైక్ లీ, రిపబ్లికన్ సెనెటర్
గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వలసదారులు, వారి పిల్లలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో సెనెటర్ డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన బిల్లుపై మైక్ లీ మాట్లాడారు.
సంరక్షణ కోసం చర్యలు!
వలసదారు హోదా కోల్పోకుండానే వారికి కొన్ని రక్షణలు కల్పించే విధంగా బిల్లులో మార్పులు చేసినట్లు డర్బిన్ పేర్కొన్నారు. గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌లో ఉన్న వలసదారులు మరో ఉద్యోగం చూసుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు.
ఈ బిల్లు ద్వారా ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ చట్టానికి మూడు మార్పులు జరగనున్నాయి. బిల్లు ద్వారా బ్యాక్‌లాగ్‌లో ఉన్న వలసదారులు సత్వరమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. వలసదారులు తమ ఉద్యోగాన్ని మార్చుకోవచ్చు. అంతేగాక వలసదారు హోదా కోల్పోకుండానే దేశంలో ప్రయాణించవచ్చు. ఈ సవరణ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోవడం వల్ల ముందస్తు దరఖాస్తు చేయలేని వలసదారులకు గ్రీన్‌కార్డులు కేటాయిస్తారు.
మరోవైపు... 50 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు లేదా 50 శాతం తాత్కాలిక ఉద్యోగులు ఉన్న సంస్థలు హెచ్1బీ వీసాల ద్వారా అదనపు ఉద్యోగులను చేర్చుకోకుండా ఈ బిల్లు నిరోధిస్తుంది.
భారతీయులకు గ్రీన్‌కార్డులు
2019 ఆర్థిక సంవత్సరంలో 9,008 మంది భారతీయులకు ఈబీ1(కేటగిరీ 1) గ్రీన్‌కార్డులు జారీ అయ్యాయి. 2,908 మందికి కేటగిరీ 2(ఈబీ2) గ్రీన్‌కార్డులు జారీ కాగా.. 5,083 మందికి కేటగిరీ 3(ఈబీ3) గ్రీన్‌కార్డులు మంజూరయ్యాయి.
ఇదీ చదవండి-కరోనా రోగి మృతిపై ఆగ్రహం- అంబులెన్స్‌కు నిప్పు