తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎన్నికల మోసాలపై రిపబ్లికన్ పార్టీలో చీలికలు! - Biden inauguratation on January 20

అమెరికా అధ్యక్ష ఫలితాలను మార్చేయాలని డొనాల్డ్ ట్రంప్ అకుంఠిత దీక్ష చేస్తున్నారు. అధికార బదిలీని నిరాకరించాలని, బైడెన్ గెలుపును సవాల్ చేయాలని లెక్కలేనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలే తన పార్టీలో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ వైఖరికి కొందరు మద్దతిస్తుండగా.. మరికొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

biden
రిపబ్లికన్ పార్టీలో చీలికలు!

By

Published : Jan 4, 2021, 7:43 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలన్న ప్రయత్నాలతో రిపబ్లికన్ పార్టీలో చీలికలు మొదలైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్​కు ఇబ్బందులు కలిగించాలని, అధికార బదిలీని నిరాకరించాలనే ట్రంప్ వైఖరికి పలువురు రిపబ్లికన్ చట్టసభ్యులు మద్దతు తెలుపుతుండగా.. అమెరికన్లు ప్రజాస్వామ్యంపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయొద్దని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.

ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో బైడెన్ విజయాన్ని నిర్ధరించడానికి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం నిర్వహించనుంది. ఇందులో బైడెన్ గెలుపును సవాల్ చేసేలా 100 మంది రిపబ్లికన్ చట్టసభ్యులను, డజను మంది రిపబ్లికన్ సెనెటర్లను ట్రంప్ కూడగట్టినట్లు తెలుస్తోంది. వీరంతా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఓటింగ్ మోసాల గురించి సభ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది.

జనవరి 20న జో బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అధికార బదిలీ సాఫీగా జరగకుండా ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితాలు మార్చాలని ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. జార్జియాలో బైడెన్ గెలుపును తన ఖాతాలో వేయాలని, అందుకు అవసరమైన ఓట్లను వెతికి పట్టుకోవాలని ట్రంప్ ఆదేశించిన ఆడియో సైతం ఇటీవల బయటకు వచ్చింది. అదేసమయంలో ఎన్నికల్లో మోసాలపై వాషింగ్టన్​లో ర్యాలీలు చేపట్టేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు.

'అవహేళన చేయడమే'

అయితే మోసాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఫలితాలపై అనుమానాలు వ్యక్తం మంచిది కాదని రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధరించిన ఎన్నికల ఫలితాల్లో జోక్యం చేసుకోవడం తగదని సూచిస్తున్నారు. ఎన్నికల ఫలితం మార్చేందుకు ఒక్క ఆధారం కూడా లేదని అటార్నీ జనరల్ విలియమ్ బార్ పేర్కొన్నారు. ఇదే అభిప్రాయంతో మరో 10 మంది సంయుక్త ప్రకటన విడుదల చేశారు. '2020 ఎన్నికలు ముగిసిపోయాయి. ఈ సమయంలో ఎన్నికల చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తం చేయడం అమెరికన్ల స్పష్టమైన తీర్పుకు వ్యతిరేక'మంటూ వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికలను వ్యతిరేకించాలని చట్టసభ్యులు భావించడం.. మన వ్యవస్థను అవహేళన చేయడమే అని మేరీలాండ్ గవర్నర్, రిపబ్లికన్ నేత లారీ హోగ్ పేర్కొన్నారు.

అటు.. డెమొక్రటిక్ నేతల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 'రిపబ్లికన్ల ఎత్తులేవీ ఫలించవని, జనవరి 20న ప్రమాణస్వీకారం జరగకుండా అడ్డుకోలేవ'ని బైడెన్ అధికారబదిలీ కమిటీ ప్రతినిధి మైక్ గ్విన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వికేంద్రీకరణతోనే 'మూడో అంచె' పరిపుష్టం

ABOUT THE AUTHOR

...view details