ప్రపంచంపై కొవిడ్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య 25 లక్షలకు చేరువైంది. మొత్తం మరణాలు 1.7 లక్షలు దాటిపోయింది. 6,45,019 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అమెరికాలో అత్యధికంగా 7.8 లక్షల కేసులు నమోదుకాగా.. స్పెయిన్‌లో ఈ సంఖ్య 2 లక్షలు దాటింది. గత 24 గంటల వ్యవధిలో 64 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 5,102 వేల మంది మరణించారు.
ఫ్రాన్స్‌లో 547
ఫ్రాన్స్‌లో మరణాల సంఖ్య 20 వేలు దాటింది. కొత్తగా 547 మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 20,265కి చేరినట్లు వైద్య శాఖ అధికారి జెరోమీ సాలోమోన్ ప్రకటించారు. ఓ బాధాకరమైన మైలురాయిని ఫ్రాన్స్ అధిగమించినట్లు జెరోమీ పేర్కొన్నారు. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడాన్ని స్వాగతించారు.
ఇటలీలో తగ్గుముఖం!
ఇటలీలో తొలి కరోనా కేసు నమోదైన తర్వాత మొదటిసారి బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అధికారులు ప్రకటించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఈ నెలలోనే అతి తక్కువ స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 1,08,237 మంది చికిత్స నుంచి కోలుకుంటున్నట్లు తెలిపారు.