ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్... 16 దేశాల పోలీసుల కలయిక. 32 టన్నుల మాదక ద్రవ్యాలు, రూ.వెయ్యి కోట్లకు పైగా నగదును పట్టించిన మాధ్యమం.. 800 మంది నేరస్థులపై ఉక్కుపాదం మోపేందుకు ఉపయోగించిన వేదిక. అంతర్జాతీయ స్థాయిలో వివిద దేశాలన్నీ కలిసి చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ ఫలితమే ఇదంతా.
అమెరికాకు చెందిన ప్రముఖ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) చేపట్టిన కార్యక్రమమే 'ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్'. నేరస్థుల నుంచే సమాచారాన్ని సేకరించి.. వారి గుట్టును రట్టు చేసి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భారీ నేరాలను గుర్తించేందుకు దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ఓ పటిష్ఠ భద్రతా ఫీచర్లు ఉన్న ఓ యాప్‌ను ఉపయోగించారు. నేరస్థులకు దీన్ని ఎరగా వేశారు.
వాటి కోసం అన్వేషణ
నేరస్థులు సాధారణంగా అత్యంత భద్రతా ప్రమాణాలు ఉన్న ఫోన్లను ఉపయోగిస్తారు. వారు చేసుకునే మెసేజ్‌లు ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడతారు. నేర సామ్రాజ్యంలో సుపరిచితమైన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాంలు రెండు ఉన్నాయి. అవి.. ఎన్క్రో చాట్, స్కై ఈసీసీ. అయితే ఈ వేదికలపై ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో డ్రగ్ మాఫియా, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌లు అధిక భద్రత కలిగిన ఫోన్లు, ప్లాట్‌ఫాంల అన్వేషణలో పడ్డారు.
"ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫాంలు లేకపోవడం వల్ల నేరస్థులకు శూన్యత ఏర్పడింది. అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు మాకు అవకాశం లభించింది. ఓ నిర్దిష్టమైన సాధనాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా.. సమాచారాన్ని సేకరించే ప్రక్రియను రూపొందించాలని అనుకున్నాం. మేం సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి.. నేరాలను అరికట్టాం. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకున్నాం. ఆయుధాలను సీజ్ చేశాం. వందల సంఖ్యలో నేరాలను నిలువరించేందుకు ఇది ఉపయోగపడింది."
-కాల్విన్ షివర్స్, ఎఫ్‌బీఐ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్
భద్రతా ఫీచర్లు ఉన్న యాప్ అన్వేషణలో ఉన్న నేరస్థులకు పోలీసులే తెరవెనక నుంచి పరిష్కారం చూపించారు. 'అనోమ్' అనే యాప్‌ను ఫోన్లలో ఇన్స్టాల్ చేసి.. నేరస్థులకు చేరేలా ప్రణాళికలు వేశారు. ఇది అత్యంత పటిష్ఠమైన ఉన్న ప్లాట్‌ఫాం అని నేరస్థులు విశ్వసించారు. మాఫియాలో దీని వినియోగం బాగా పెరిగింది.
100 దేశాలకు
గత 18 నెలల కాలంలో 300కు పైగా క్రిమినల్ గ్యాంగ్‌లకు ఇలాంటి ఫోన్లు చేరాయి. వీరంతా 100 దేశాల్లో పనిచేస్తున్నారు. మాదక ద్రవ్యాల సరఫరా నుంచి తీవ్రమైన నేరాల వరకు.. వారు వేసుకునే ప్రణాళికలన్నింటినీ ఈ యాప్ ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన అధికారులు ఈ యాప్ ద్వారా లభించిన సమాచారాన్ని ఉపయోగించి అనేక నేరాలను అడ్డుకున్నారు.