కరోనా మహావిలయంలో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజుకు లక్షల మందికి సోకుతూ.. వేగంగా వ్యాపిస్తోంది. శనివారం కొత్తగా 4.52 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4.29కోట్లు దాటింది. 11.54 లక్షలకుపైగా మరణించారు. అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో 83 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొలంబియాలో కేసుల సంఖ్య 10 లక్షల మార్క్‌ను అధిగమించింది. ఫ్రాన్స్‌లోనూ వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.
కరోనా వైరస్
By
Published : Oct 25, 2020, 8:33 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. శనివారం కొత్తగా 4.52 లక్షల మందికి వైరస్ సోకగా.. 5,592 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, భారత్‌తో పాటు ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో ఉద్ధృతి అధికంగా ఉంది. కొలంబియాలో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 8 దేశాలు ఈ మార్క్‌ను దాటాయి.
మొత్తం కేసులు: 42,923,942
మరణాలు: 1,154,736
కోలుకున్నవారు: 31,665,705
క్రియాశీల కేసులు: 10,103,501
అమెరికాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శనివారం రికార్డు స్థాయిలో 83,757 కొత్త కేసులు వచ్చాయి. మరో 784 మంది ప్రాణాలు కోల్పోయారు. దింతో మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. నార్త్ కరోలినాలో వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో నగరంలోని అతిపెద్ద చర్చిని మూసివేయాలని ఆరోగ్య అధికారులు ఆదేశించారు. న్యూయార్క్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. పాఠశాలు మూసివేయటం సహా.. అత్యవసరం కాని వ్యాపార సముదాయాలపై ఆంక్షలు విధించేందుకు అనుమతులు కోరినట్లు నగర మేయర్ తెలిపారు. దీంతో 100 పబ్లిక్, 200 ప్రైవేటు పాఠశాలలు మూతపడనున్నాయి.
బ్రెజిల్లో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగా 25వేల కేసులు నమోదయ్యాయి. 398 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 54 లక్షలకు చేరువైంది.
ఫ్రాన్స్‌లో వైరస్ విజృంభిస్తోంది. శనివారం కొత్తగా 45వేల కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 11 లక్షలకు చేరువైంది. అయితే.. రికవరీలు పెరగటం, మరణాల సంఖ్య తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది.
కొలంబియాలో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. శనివారం మరో 8,769 మంది కరోనా బారినపడ్డారు. 10 లక్షల మార్క్‌ను దాటిన ఎనిమిదో దేశంగా నిలిచింది కొలంబియా. అలాగే.. లాటిన్ అమెరికాలో ఒక వారం లోపే ఈ మార్క్‌ను చేరుకున్న రెండో దేశంగా నిలిచింది. ఆగస్టులో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్నా.. ప్రస్తుతం రోజుకు 8 వేల లోపు మాత్రమే కొత్త కేసులు వస్తున్నాయి.
ఆఫ్రికాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు చేరువైంది. ఈ మేరకు వివరాలు వెల్లడించింది ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం.
బ్రిటన్‌లో శనివారం కొత్తగా 23 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8.5 లక్షలు దాటింది.
సింగపూర్‌లో మరో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 57,812కు చేరింది.