ప్రపంచదేశాలపై కరోనా పంజా.. ఇటలీలో మళ్లీ విజృంభణ - కరోనా ప్రపంచవ్యాప్తంగా కేసులు
ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2.86 కోట్లు దాటింది. 9.20 లక్షల మంది వరకు మరణించారు. ఇటలీలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. భారత్ తర్వాత అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
కరోనా విలయం
By
Published : Sep 12, 2020, 9:05 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఆర్థిక, సామాజిక సేవలు ప్రారంభమైన నేపథ్యంలో వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకు 3 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2.86 కోట్లు దాటింది. దాదాపు 9.2లక్షల మంది వైరస్ కాటుకు బలయ్యారు. ఇప్పటి వరకు 2 కోట్ల 5 లక్షలకుపైగా కోలుకోవటం ఊరట కలిగిస్తోంది. భారత్ సహా అమెరికా, బ్రెజిల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
మొత్తం కేసులు: 28,649,519
మరణాలు: 919,577
కోలుకున్నవారు: 20,574,287
యాక్టివ్ కేసులు: 7,155,655
అమెరికాలో కొత్త కేసుల నమోదులో కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించగా మళ్లీ పుంజుకుంటోంది. శుక్రవారం మరో 47వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 66 లక్షలు దాటింది. 1.97 లక్షల మంది మరణించారు.
బ్రెజిల్లో మరో 44 వేలమందికిపైగా వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకు వైరస్ కాటుకు 1.30 లక్షల మంది బలయ్యారు. 35 లక్షల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.
రష్యాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయితే.. 8.68 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 18 వేలకుపైగా మరణించారు.
ఇటలీలో వరుసగా ఆరువారాలుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రజలు సెలవులు ముగించుకుని ఇళ్లకు ప్రయాణమవుతుండటం, పరీక్షల పెంపుతో కేసులు పెరుగుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం మరో 1,616 కొత్త కేసులు వచ్చినట్లు తెలిపింది. సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభిస్తున్న క్రమంలో కేసుల గుర్తింపుపై దృష్టిసారించినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 284,796 కేసులు నమోదుకాగా.. 35,597 మంది మరణించారు.