కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతూనే ఉంది. 200కుపైగా దేశాలు, చిన్న భూభాగాల్లో కలిపి కోటీ 50 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. 6.20 లక్షల మంది వరకు మృతి చెందారు. జులై నెలలో రోజూ సగటున 2 లక్షలు దాటి కొత్త కేసులొస్తున్నాయి. టీకాలు వస్తే తప్ప సాధారణ జీవన పరిస్థితులు నెలకొనే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యాల్లో అదే స్థాయిలో ఉద్ధృతి కొనసాగుతోంది. పెద్ద దేశాలతో పాటు, పెరూ, చిలీ లాంటి చిన్న దేశాల్నీ వైరస్ కుదిపేస్తోంది.
- మొత్తం కేసులు: 15,091,880
- మొత్తం మరణాలు: 619,410
- కోలుకున్నవారు: 9,110,208
- యాక్టివ్ కేసులు: 5,362,262
ఏయే దేశాల్లో ఎలా..
అమెరికాలో..
అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి ఉద్ధృతి ఆగడం లేదు. కేసులు, మరణాలూ ఇక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 40.28 లక్షలమందికిపైగా వైరస్ సోకింది. మరో 1.44 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా న్యూయార్క్‌లో కేసులుండగా న్యూజెర్సీ, మసాచూసెట్స్, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లోనూ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్లోరిడా, టెక్సాస్, ఆరిజోనా వంటి రాష్ట్రాల్లో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.
అమెరికాలో మొత్తం ఇంతవరకు 18.86 లక్షల మంది కోలుకోవడమే కొంతలో కొంత ఊరట.
బ్రెజిల్
కేసులు, మరణాల్లోనూ రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. 21.66 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 81 వేల మందికి పైగా చనిపోయారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి.