కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతూనే ఉంది. 200లకుపైగా దేశాలు, చిన్న భూభాగాల్లో కలిపి ఆదివారం నాటికి దాదాపు కోటీ 46 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. 6 లక్షల మందికి పైగా మృతి చెందారు. జులై నెలలో రోజూ సగటున 2 లక్షలు దాటి కొత్త కేసులొస్తున్నాయి. అత్యధికంగా 24 గంటల్లో 2,54,381 కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీకాలు వస్తే తప్ప సాధారణ జీవన పరిస్థితులు నెలకొనే అవకాశమే లేదని బ్రిటన్ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యాల్లో అదే స్థాయిలో ఉద్ధృతి కొనసాగుతోంది. పెద్ద దేశాలతో పాటు, పెరూ, చిలీ లాంటి చిన్న దేశాల్నీ వైరస్ కుదిపేస్తోంది. తాజాగా పెరూను వెనక్కినెట్టి దక్షిణాఫ్రికా ఐదో స్థానానికి చేరింది. ఎక్కువ మరణాలు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, మెక్సికో, ఇటలీలు మొదటి 5 స్థానాల్లో ఉండగా భారత్ 8వ స్థానంలో ఉంది.
- మొత్తం కేసులు: 14,640,375
- మొత్తం మరణాలు: 608,857
- కోలుకున్నవారు: 8,734,805
- యాక్టివ్ కేసులు: 5,296,713
ఏయే దేశాల్లో ఎలా..
అమెరికాలో..
అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి ఉద్ధృతి ఆగడం లేదు. కేసులు, మరణాలూ ఇక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి 38. 98 లక్షల కేసులు బయటపడగా.. 1.43 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా న్యూయార్క్‌లో 4 లక్షల కేసులుండగా, 32 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీ, మసాచుసెట్స్, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లోనూ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్లోరిడా, టెక్సాస్, ఆరిజోనా వంటి రాష్ట్రాల్లో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌లు ఎత్తివేయడం, మాస్కులు ధరించడానికి కొందరు అమెరికన్లు ఇష్టపడకపోవడం వంటి కారణాల వల్లే పలుచోట్ల కేసులు పెరుగుతున్నాయన్న విమర్శలున్నాయి.
ఐసీయూలు ఖాళీలు ఉండటం లేదు. రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో గంటలకొద్దీ ఆసుపత్రుల్లో వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో మొత్తం ఇంతవరకు 18.02 లక్షల మంది కోలుకోవడమే కొంతలో కొంత ఊరట.
21 లక్షలకు చేరువలో..
కేసులు, మరణాల్లోనూ రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. 20.99 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 79 వేల మందికి పైగా చనిపోయారు. ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.
మరణాలు తక్కువే అయినా..