కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. తాజాగా మొత్తం కరోనా కేసులు కోటీ 8 లక్షలు దాటగా, మృతుల సంఖ్య 5 లక్షల 19 వేలకు చేరువైంది.
అమెరికాలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. కొత్తగా అక్కడ 52 వేల కొవిడ్ కేసులు, 676 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 27 లక్షల 79 వేలకు, మరణాల సంఖ్య లక్షా 30 వేలకు పైగా పెరిగింది.
నిర్లక్ష్యమే కారణం
అమెరికాలో ఆంక్షల సడలింపు తరువాత ప్రజలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం... ముఖ్యంగా మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లనే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.