తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 804 మంది మృతి

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ తన ఉద్ధృతిని కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా బ్రెజిల్‌లో తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 10 వేలకుపైగా కేసులు, 804 మరణాలు సంభవించాయి. బ్రిటన్​లో మరో 626 మంది చనిపోయారు. రష్యాలో కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. ఇటలీలో మరణాల సంఖ్య 30 వేలు దాటింది.

Global COVID-19 tracker
బ్రెజిల్​లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 804 మంది మృతి

By

Published : May 9, 2020, 7:13 AM IST

ప్రాణాంతక కరోనా... యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 40 లక్షలు దాటింది. ఇప్పటివరకు 2 లక్షల 75 వేలమందికిపైగా మహమ్మారి బలితీసుకుంది. మరో 13 లక్షల మంది కోలుకున్నారు.

అమెరికాలో మొత్తం కరోనా కేసులు 13 లక్షల 20 వేలు దాటాయి. ఇప్పటివరకు 78 వేల 610 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో దాదాపు మరో 30 వేల మంది వైరస్​బారిన పడ్డారు.

ఆ రెండు దేశాల్లో...

బ్రెజిల్​లో కరోనా తీవ్రరూపం దాలుస్తుంది. శుక్రవారం ఒక్కరోజే 10 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 804 మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 9992కు చేరింది.

రష్యాలో రోజూ 10 వేలకుపైగా కొత్తగా బాధితులు చేరుతున్నారు. అక్కడ కేసులు లక్షా 87 వేలు దాటగా.. ఇప్పటివరకు 1723 మంది బలయ్యారు.

ఐరోపాలో...

  • జర్మనీలో 24 గంటల వ్యవధిలో 118 మంది బలయ్యారు.
  • బ్రిటన్‌లో కొత్తగా 4,600 మందికి వైరస్ సోకింది. మరో 626 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 31,241కు చేరింది.
  • ఇటలీలో మరణాలు 30 వేలు దాటాయి. 24 గంటల్లోనే మరో 243 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు విడిచారు. మొత్తం 2 లక్షల 17 వేల మంది వైరస్​ బారినపడ్డారు.
  • ఒక్కరోజులో స్పెయిన్​లో 229, ఫ్రాన్స్​లో 243 మంది మరణించారు.

మిగతా దేశాల్లో...

  • ఇరాన్​ కరోనా మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది. అక్కడ మరో 55 మంది చనిపోగా.. కొత్తగా 1500 మందికి వైరస్​ సోకింది.
  • పాకిస్థాన్​లో మరో 1791 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 26 వేల 435కు చేరగా.. ఇప్పటివరకు 599 మంది చనిపోయారు.
  • సింగపూర్​లో మొత్తం కేసులు 21 వేల 707కు చేరాయి. మరో 20 మంది మరణించారు.

మళ్లీ ప్రమాదమే...

ఆంక్షలను సడలించడం వల్ల వైరస్‌ మళ్లీ బుసలుకొట్టే ముప్పుందని చైనా, దక్షిణ కొరియా నిపుణులు భావిస్తున్నారు. ఆంక్షలను సడలించిన అనంతరం ఈ దేశాల్లో కేసులు ఎక్కువకావడం గమనార్హం. 'ఒక్క ఇంకు చుక్క శుద్ధమైన నీటిలో ఎలా వ్యాపిస్తుందో... ఒక్క వ్యక్తికి సోకిన కరోనా వైరస్‌ కూడా అంతగా వ్యాపించగలదు. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు’' అని దక్షిణ కొరియా ఆరోగ్య ఉపమంత్రి కిమ్‌-గాంగ్‌ లిప్‌ వ్యాఖ్యానించారు.

లాక్‌డౌన్‌లను ఎత్తివేసిన తర్వాత ప్రతి దేశంలోనూ ఎంతోకొంత వైరస్‌ ఉద్ధృతి కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details