తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​లో కరోనా టాప్​గేర్​.. ఒక్కరోజే 54 వేల కేసులు - కరోనా పంజా: కొత్తగా రెండు లక్షల 59 వేల కేసులు

గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా మరో 2.59 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య రెండు కోట్ల 5 లక్షలకు చేరింది. 6,336 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్​లో ఏకంగా 54 వేలకుపైగా కేసులు గుర్తించారు అధికారులు. అమెరికా, మెక్సికో, కొలంబియాల్లోనూ వైరస్ విలయతాండవం చేస్తోంది.

Global COVID-19 tracker
కరోనా పంజా: కొత్తగా రెండు లక్షల 59 వేల కేసులు

By

Published : Aug 12, 2020, 8:32 AM IST

కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య రెండు కోట్ల 5 లక్షలు దాటింది. గడిచిన ఒక్కరోజులో 2,59,574 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 6,336 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7.44 లక్షలకు చేరింది.

మరోవైపు వైరస్​ నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం కాస్త సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 251,015 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీల సంఖ్య కోటీ 34 లక్షలకు పెరిగింది.

54 వేలకుపైగా

బ్రెజిల్​లో గత రెండు రోజులుగా 20 వేలకుపైగా నమోదవుతున్న కేసులు ఒక్క ఉదుటున 50 వేలకు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 54,923 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో బ్రెజిల్​లో మొత్తం బాధితుల సంఖ్య 31.12 లక్షలకు ఎగబాకింది. మరో 1,242 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య లక్షా 3 వేలు దాటింది.

1,455 మరణాలు

అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఇప్పటివరకు ఏ దేశంలో లేనన్ని కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. తాజాగా మరో 1,455 మరణాలు సంభవించాయి. దీంతో మృతుల సంఖ్య 1.67 లక్షలకు చేరింది. కొత్తగా నమోదైన 54 వేల కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 53 లక్షలకు పెరిగింది.

రష్యా

ఇప్పటికే టీకాను విడుదల చేసిన రష్యాలో మరో 4,945 పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. మొత్తం బాధితుల సంఖ్య 9 లక్షలకు చేరువైంది. 130 మంది మరణించడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 15,131కి చేరింది.

926 మంది మరణం

మెక్సికోలో కరోనావైరస్ మరణమృదంగం మోగిస్తోంది. ఒక్కరోజులో 926 మంది మరణించగా.. ఇప్పటివరకు వైరస్​కు బలైనవారి సంఖ్య 54 వేలకు చేరువైంది. కొత్తగా 6,686 కేసులు వెలుగుచూశాయి. మొత్తం 4.92 లక్షల మంది వైరస్ బారినపడ్డారు.

నాలుగో స్థానం..

భారత్, అమెరికా, బ్రెజిల్ తర్వాత కొలంబియాలోనే అధికంగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 12,830 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 4.10 లక్షలకు చేరగా.. మృతుల సంఖ్య 13,475కి పెరిగింది. ఒక్కరోజులో 321 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 53,05,957 1,67,749
బ్రెజిల్ 31,12,393 1,03,099
రష్యా 8,97,599 15,131
దక్షిణాఫ్రికా 5,66,109 10,751
మెక్సికో 4,85,836 53,003
పెరూ 4,83,133 21,276

ABOUT THE AUTHOR

...view details