ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య రెండు కోట్లు దాటగా... గత 24 గంటల వ్యవధిలో మరో 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. నాలుగు వేలకు పైగా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 737,899కి చేరింది.
అటు.. రికవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం కోటి 31 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 64 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
- అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 49,800 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 52.51 లక్షలకు చేరింది.
- బ్రెజిల్లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మరో 21,888 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బ్రెజిల్లో కేసుల సంఖ్య 30 లక్షలకు చేరగా.. మృతుల సంఖ్య లక్ష దాటిపోయింది. గడిచిన 24 గంటల్లో 721 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కరోనా మరణాల సంఖ్య 15 వేలు దాటింది. కరోనా సోకడం వల్ల తాజాగా 70 మంది మరణించారు. కొత్తగా 5 వేల కేసులు నమోదుకాగా... మొత్తం బాధితుల సంఖ్య 9 లక్షలకు చేరవైంది.
- కొలంబియాలో కరోనావైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతోంది. కొత్తగా 10,142 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3.97 లక్షలకు చేరింది. మరో 312 మంది మృత్యువాత పడ్డారు.
- అర్జెంటీనాలో ఒక్కరోజే 7 వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 2.53కి ఎగబాకింది. 158 మంది వైరస్ ధాటికి ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 13,154కి పెరిగింది.