ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటీ 40 లక్షలు దాటింది. మృతుల సంఖ్య ఆరు లక్షలకు చేరువగా ఉంది. బ్రెజిల్లో మొత్తం బాధితుల సంఖ్య 20 లక్షలు దాటిపోయింది.
గ్లోబల్ కరోనా ట్రాకర్
By
Published : Jul 17, 2020, 8:35 PM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. బ్రెజిల్, రష్యా, అమెరికా, పెరూ దేశాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 40 లక్షలు దాటిపోయింది. మృతుల సంఖ్య 5,93,771కి చేరింది. 83 లక్షల మంది వైరస్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 5 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
రష్యాలో మరో 6 వేలకుపైగా కేసులు, 186 మరణాలు నమోదయ్యాయి. మెక్సికోలోనూ కొత్తగా 6 వేల 406 మంది వైరస్ బారినపడ్డారు. మరో 668 మంది చనిపోయారు.
పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 2.6 లక్షలకు చేరింది. 2,085 మందికి కొత్తగా కరోనా కేసులు నమోదుకాగా.. మరో 49 మంది మరణించారు. 1,83,737 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1895 మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లో మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది.
అయితే జాతీయ వైద్య సంస్థ నిర్వహించిన సీరోలాజికల్ సర్వే ప్రకారం దేశంలో 3 లక్షల మంది కరోనాబారిన పడ్డట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో హెర్డ్ ఇమ్యునిటీ పెరుగుతోందని తేలింది. వైరస్ సోకిన చాలా మంది వ్యక్తులకు లక్షణాలు లేవని డాన్ పత్రిక వెల్లడించింది.
విదేశీ ప్రయాణికుల వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దేశంలో కరోనా అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు దక్షిణ కొరియా పేర్కొంది. దేశంలో కొత్తగా 60 కేసులు నమోదు కాగా ఇందులో 39 విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సింగపూర్‌లో మరో 327 కేసులు నమోదయ్యాయి. సింగపూర్‌లో మొత్తం కేసుల సంఖ్య 47,453కి చేరింది. 27 మంది మరణించారు.
అమెరికాలో కేసులు 37 లక్షలు దాటిపోయాయి. కరోనా అత్యంత తీవ్రంగా ఉన్న బ్రెజిల్లో బాధితుల సంఖ్య 20 లక్షలు దాటింది.