వైరస్ విలయం: రెండు కోట్ల 10 లక్షలకు కేసులు - కొవిడ్-19 తాజా వార్తలు
ప్రపంచదేశాల్లో కరోనావైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2.72 లక్షల కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య రెండు కోట్ల 10 లక్షల మార్క్ అధిగమించింది. మొత్తం మృతుల సంఖ్య 7.52 లక్షలకు పెరిగింది. రష్యా, దక్షిణాఫ్రికాల్లో కేసులతో పోలిస్తే రికవరీలు అధికంగా నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.
వైరల్ విలయం: రెండు కోట్ల 10 లక్షలకు కేసులు
By
Published : Aug 14, 2020, 8:07 AM IST
|
Updated : Aug 14, 2020, 8:21 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య కొత్త శిఖరాలకు చేరుతుండటం సామాన్య ప్రజానీకానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితులు, మృతుల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా మారింది.
అన్నిదేశాల్లో కలిసి కరోనా బాధితుల సంఖ్య రెండు కోట్ల 10 లక్షల మార్క్ అందుకుంది. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 72 వేల కేసులు ఇందుకు జతయ్యాయి. మరో 6,357 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 7.52 లక్షలకు పెరిగింది.
బ్రెజిల్
బ్రెజిల్లో కరోనావైరస్ భయానకం సృష్టిస్తోంది. కేసులు రోజుకో గరిష్ఠస్థాయిని తాకుతున్నాయి. తాజాగా 59 వేల మంది కరోనా బారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. మొత్తం కేసుల సంఖ్య 32 లక్షల 29 వేలకు చేరినట్లు తెలిపారు. 1,301 మంది బాధితులు కొవిడ్ ధాటికి మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,05,564కి చేరింది.
అగ్రరాజ్యం
అమెరికాను కరోనా కబళిస్తోంది. మొత్తం లక్షా 70 వేల మంది బాధితుల మరణంతో దేశం మృత్యుదిబ్బగా మారింది. గడిచిన 24 గంటల్లో 1,284 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 55 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఫలితంగా దేశంలో బాధితుల సంఖ్య 54 లక్షలకు చేరింది.
మెక్సికో
మెక్సికోలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. మరో 627 మంది మృతితో దేశంలో మరణాల సంఖ్య 55 వేల మార్క్ దాటింది. కొత్తగా 7,371 కేసులు నమోదుకాగా.. బాధితుల సంఖ్య 5 లక్షలు దాటింది.
కొలంబియా
గత కొంత కాలంగా కొలంబియాలో రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 11,286 మందికి కరోనా సోకినట్లు తేలింది. 308 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 33 వేలకు చేరగా.. మరణాల సంఖ్య 14 వేలకు ఎగసింది.
రష్యా
రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ రికవరీలు పెరుగుతుండటం రష్యాకు సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. కొత్తగా 5 వేల మందికి కరోనా సోకినట్లు తేలగా.. 6 వేలకుపైగా బాధితులు కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 7 వేలకు చేరింది. 124 మంది మృతి చెందడం వల్ల మరణాల సంఖ్య 15,384కి పెరిగింది.
దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా కేసులతో పోలిస్తే రికవరీలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,946 కేసులు గుర్తించగా.. 5,588 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. మరో 260 మంది మరణంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,270కి చేరింది.