కరోనా రక్కసి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 97 వేలకు మందికిపైగా మరణించారు. కేసుల సంఖ్య 16 లక్షలు మించిపోయింది. అయితే 3 లక్షల 65 వేల మందికిపైగా బాధితులు కోలుకోవడం కాస్త ఊరట.
ఐరోపా అతలాకుతలం
స్పెయిన్: ఈ ఒక్క రోజే 605 మంది కరోనాతో మరణించారు. అయితే దేశంలో గత 17 రోజుల్లోని కరోనా మరణాల సంఖ్య తీసుకుంటే ఇదే అత్యల్పం కావడం గమనార్హం.
ఐరోపాలో మహమ్మారి వైరస్ ధాటికి భారీగా దెబ్బతిన్న దేశం స్పెయిన్. ఇప్పటి వరకు అక్కడ 1,57,022 కేసులు నమోదవగా... 15,843 మంది కరోనాకు బలయ్యారు.
ఒక్కరోజే దాదాపు 500 మంది
రోజువారీ కరోనా మరణాలు రేటు బెల్జియంలో ఒక్కసారిగా పెరిగిపోయింది. గత 24 గంటల్లో 496 కరోనా మరణాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది.
బెల్జియంలో మొత్తం మృతుల సంఖ్య 3019కి చేరింది. కొత్తగా 1684 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 26,667కు చేరుకుంది.
నెదర్లాండ్స్‌లో మరో 115 మంది మరణించగా.. మొత్తం మృతులు 2511కి చేరారు. ఇవాళ కొత్తగా 1335 కేసులు నమోదయ్యాయి.
ఫ్రాన్స్: ఫ్రెంచ్ విమాన వాహక నౌక చార్లెస్ డి గల్లె సిబ్బందిలో 50 మందికి కరోనా లక్షణాలు బయటపడినట్లు సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే వీరెవరికీ కరోనా పాజిటివ్ అని ఇప్పటి వరకు నిర్ధరణ కాలేదు. ముందు జాగ్రత్తగా ముగ్గురు సెయిలర్స్‌ను అధికారులు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆసియా దేశాల్లో.. కరోనా బీభత్సం
ఇరాన్లో స్థిరంగా..
ఇవాళ ఒక్కరోజే ఇరాన్లో 122 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,323కు చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో అక్కడ 1,972 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 68 వేలు దాటింది.
లాక్డౌన్ ఆంక్షల కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పరిరక్షించే ఉద్దేశంతో 'తక్కువ రిస్క్' వ్యాపారాలను రేపటి నుంచి ప్రారంభించాలని ఇరాన్ నిర్ణయించింది. కానీ నేడు ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోవడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది.
అక్కడ తొలికేసు..
యుద్ధాలతో చితికిపోతున్న యెమెన్‌లో మొదటి కరోనా కేసు నమోదు అయ్యింది. దక్షిణ ప్రావిన్స్‌లో కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసిన నేపథ్యంలో.. కనీస వైద్య సదుపాయాలు లేని ఆ దేశాన్ని మహమ్మారి కబళించేస్తుందా అనే భయాలు నెలకొన్నాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సైన్యం ఏకపక్షంగా రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించడం యెమెన్‌కు కాస్త ఊరట.
సింగపూర్‌లోని భారతీయులకు కరోనా
సింగపూర్‌లోని విదేశీ కార్మికుల వసతి గృహాల్లో... నివసిస్తున్న 250 మంది భారతీయులు కరోనా బారిన పడ్డారని భారత హైకమిషన్ శుక్రవారం తెలిపింది. అయితే ప్రస్తుతం వీరి ఆరోగ్యం స్థిరంగానే ఉందని, కొంత మంది కోలుకుంటున్నారని స్పష్టం చేసింది. విదేశీయులతో కలిసిమెలసి పనిచేస్తున్న నేపథ్యంలోనే వారికి ఈ అంటువ్యాధి సోకినట్లు భావిస్తున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 96,940కి చేరిన కరోనా మృతుల సంఖ్య ఇదీ చూడండి:ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కరోనా!