gita gopinath imf chief economist: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్‌కు పదోన్నతి లభించింది. ఐఎమ్ఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్‌గా(ఎఫ్డీఎమ్డీ) ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఐఎమ్ఎఫ్లో మొత్తం మీద నలుగురు డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్లు ఉంటారు. జెఫ్రె ఓకమోటో.. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఐఎమ్ఎఫ్ నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో గీతా గోపీనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే.. మూడేళ్ల పాటు ముఖ్య అర్థికవేత్తగా విధులు నిర్వహించిన గీతా గోపీనాథ్.. బాధ్యతలు వదిలేసి గతంలో పని చేసిన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లనున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి.
ఈ అవకాశం తనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు గీతా గోపీనాథ్. సహచరులతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎఫ్డీఎమ్డీగా గీత బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆమెపై ఐఎమ్ఎఫ్ చీఫ్ క్రిస్టిలినా జార్జివా ప్రశంల వర్షం కురిపించారు. ఐఎమ్ఎఫ్‌లోనే కొనసాగాలని గీత తీసుకున్న నిర్ణయం సంతోషకరమన్నారు. ఇప్పటివరకు అద్భుతంగా సేవలందించారని కొనియాడారు. కొత్త బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు గీతా గోపీనాథ్ చేసిన కృషి ప్రశంసనీయమైనది తెలిపారు.
గీతా గోపీనాథ్ గురించి ఆసక్తికర విషయాలు..
- 1971లో కోల్‌కతాలో జన్మించారు. మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.
- దిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్‌లో బి.ఎ పూర్తి చేశారు. 1992లో దిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఎకనామిక్స్ అభ్యసించారు.
- వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మరోసారి ఎం.ఎ ఎకనామిక్స్‌లో చదివే అవకాశం రావడంతో తన ఐఏఎస్ ప్రణాళికలను పక్కన పెట్టేశారు. అనంతరం ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఉపకారవేతనంతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.
- అక్కడి నుంచి 2010లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ ఉండగానే 2018లో ఐఎంఎఫ్‌లో పనిచేసే అవకాశం తలుపు తట్టింది.
- గీతా గోపీనాథ్‌కు ఫ్యాషన్ రంగంలోనూ అనుభవం ఉంది. దిల్లీ వర్సిటీలో ఆమె తన భర్త ఇక్భాల్ సింగ్‌ను కలిశారు. ప్రస్తుతం వీరికి 18 ఏళ్ల రాహిల్ అనే అబ్బాయి ఉన్నాడు.
ఇదీ చూడండి:-'కరోనాపై పోరులో భారత్ పాత్ర భేష్'