ఆస్ట్రియాకు చెందిన ఆర్క్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ మృతితో మొదలైన గొడవ.. తొలి ప్రపంచయుద్ధానికి దారి తీసింది. ఇది ఒక్కటే కాదు, ఈ యుద్ధానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, ఇటలీ తదితర దేశాలు కేంద్ర రాజ్య కూటమిగా.. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా మిత్రరాజ్య కూటమిగా ఏర్పడి ప్రపంచయుద్ధంలో పాల్గొన్నాయి. అయితే యూరప్ కేంద్రంగా మొదలైన ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా అసలు పాల్గొనకూడదనే భావించింది. అందుకే చాలాకాలం యుద్ధానికి దూరంగా ఉండిపోయింది. కానీ, పక్కదేశం మెక్సికోకి జర్మనీ పంపిన ఓ టెలిగ్రామ్ అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. అప్పటి వరకు నిగ్రహంగా ఉన్న అమెరికా రణరంగంలోకి దుకాల్సి వచ్చింది. ఇంతకీ ఆ టెలిగ్రామ్‌లో ఏముంది? జర్మనీ మెక్సికోకి ఏమని సందేశం పంపింది?
అమెరికాను ప్రపంచ యుద్ధానికి ఉసిగొల్పిన 'టెలిగ్రామ్' - జిమ్మర్‌మన్ టెలిగ్రామ్ సందేశం
టెలిగ్రామ్.. సాంకేతికత సరిగ్గా అందుబాటులో లేనప్పుడు టెలిగ్రాఫ్ ద్వారా వీటిని పంపి సత్సంబంధాలు నెరిపేవారు. అయితే దీని వల్ల ఒకటో ప్రపంచ యుద్ధంలో అగ్రరాజ్యం తలదూర్చాల్సి వచ్చింది. ఆ టెలిగ్రామ్ ఎవరు పంపారు..? దాని సారాంశం ఏంటి.? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
తొలి ప్రపంచయుద్ధం 1914 జులై 28న ప్రారంభమై 1918 నవంబర్ 11న ముగిసింది. ఈ మహా సంగ్రామంలో అమెరికా ఏడాదిన్నర పాటు పాల్గొనకుండా శాంతి మంత్రాన్ని జపించింది. జర్మనీ మాత్రం అమెరికాను యుద్ధంలోకి దించేందుకు పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలోనే అమెరికా పొరుగుదేశం మెక్సికోకు జర్మనీ విదేశాంగ మంత్రి జిమ్మర్‌మన్ ఓ టెలిగ్రామ్ పంపారు. జర్మనీ మద్దతుగా యుద్ధంలో పాల్గొనాలని మెక్సికోను ఈ టెలిగ్రామ్ ద్వారా ఆహ్వానించారు. జర్మనీ తరఫున పోరాడితే ఆ తర్వాత అమెరికా నుంచి టెక్సాస్, న్యూమెక్సికో, అరిజోనా ప్రాంతాలను తిరిగి సాధించుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని మెక్సికోకి హామీ ఇచ్చారు. అయితే ఈ టెలిగ్రామ్‌ను యూకే అధికారులు మెక్సికోకు చేరకుండా అడ్డుకొని తమ దేశంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయానికి పంపారు. అక్కడి అమెరికా అధికారులు ఆ టెలిగ్రామ్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్‌కు పంపించారు.
జర్మనీ కుతంత్రాన్ని గుర్తించిన వుడ్రో విల్సన్.. జిమ్మర్‌మన్ మెక్సికోకు రాసిన టెలిగ్రామ్‌ను ప్రజలకు నోట్ రూపంలో విడుదల చేశాడు. పక్కదేశాన్ని తమపై ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్న జర్మనీపై యుద్ధం చేయడానికి ఇదే సరైన సమయమని భావించారు. శాంతి చేకూరాలన్నా, ఇకపై యుద్ధాలు జరగకూడదన్న ఇప్పుడు యుద్ధం చేయాల్సిందేనని నిర్ణయించారు. అలా 1917 ఏప్రిల్ 2న జర్మనీపై అమెరికా యుద్ధం ప్రకటించింది. మిత్రరాజ్యాల్లో అధికారికంగా కలవకపోయినా.. ఆయా దేశాలతో కలిసి జర్మనీ కూటమితో అమెరికా యుద్ధం చేసింది. మిత్రరాజ్యాలకు భారీ సైనిక, ఆర్థిక సహాయం అందించింది. యూఎస్ నుంచి దాదాపు 48లక్షల మంది సైనికులు ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. ఇందులో దాదాపు 1.17లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.