జాతి వివక్షకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ కుటుంబసభ్యులకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించారు ప్రజలు. హింసాత్మక నిరసనల జోలికి వెళ్లకుండా శాంతియుత ఆందోళనలు చేశారు.
న్యూయార్క్‌లో ఆందోళనలు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు.
నిరసనల్లో భాగంగా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన 127 మందిని మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు డెట్రాయిట్ పోలీసులు వెల్లడించారు.
సైన్యం వెనక్కి
గత రెండు రోజుల నుంచి శాంతియుత నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ డ్యూటీ సైన్యాన్ని వెనక్కి పంపిస్తున్నట్లు వాషింగ్టన్ సైనిక అధికారులు వెల్లడించారు. 200 మందిని వెనక్కి పంపించగా.. పరిస్థితి అదుపులో ఉంటే మిగిలిన వారిని సైతం తిరిగి పంపించనున్నట్లు తెలిపారు.
'హెలికాఫ్టర్' దర్యాప్తు
వాషింగ్టన్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో నిరసనకారుల పైనుంచి ఆర్మీ హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. వైట్‌హౌజ్ సమీపంలో జరిగిన ఈ 'బల ప్రదర్శన'పై నేషనల్ గార్డ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా దర్యాప్తు ప్రారంభించింది. సాధారణంగా వైద్య సేవల కోసం వినియోగించే ఈ ఆర్మీ హెలికాఫ్టర్‌ను సోమవారం నిరసనకారులు ఉన్న ప్రదేశంలో ఉపయోగించారు. పెద్ద శబ్దాలతో నిరసనకారులను భయపెట్టి చెదరగొట్టేందుకు హెలికాఫ్టర్‌ను వినియోగించారు.
ముగ్గురిపై అభియోగాలు
మరోవైపు ఫ్లాయిడ్ ఉదంతం జరిగిన సమయంలో ఘటన స్థలిలో ఉన్న మరో ముగ్గురు పోలీసు అధికారులపై హత్యకు సహకరించినట్లు అభియోగాలు మోపారు. ఫ్లాయిడ్ మృతికి కారణమైన ప్రధాన పోలీసు అధికారి డెరిక్ చౌవిన్‌పై నమోదు చేసిన హత్య కేసు తీవ్రతను రెండో డిగ్రీకి పెంచినట్లు స్థానిక వార్తా పత్రిక వెల్లడించింది. డెరిక్ మరింత తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొనున్నట్లు పేర్కొంది.