కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-7 నిర్ణయించింది. వైరస్ వ్యాప్తితో నిలిచిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు ఈ దేశాధినేతలు.
కరోనా వైరస్‌పై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసరంగా సమావేశమైన జీ-7 దేశాల నాయకులు.. సంయుక్త ప్రకటన చేశారు.
"కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. జీ-7 దేశాల వృద్ధి బలోపేతమే లక్ష్యంగా ఆర్థిక మందగమనం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటాం. సంస్థలు, కార్మికులు, మహమ్మారి కారణంగా నెమ్మదించిన రంగాలకు తక్షణ సహకారం అందిస్తాం."