తెలంగాణ

telangana

ETV Bharat / international

కలిసి కట్టుగా ఒకే జట్టుగా కరోనాపై జీ-20 పోరు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ను జీ-20 సమర్థంగా అధిగమించాలి. ఇందు కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి. మహమ్మారి కట్టడికి కొత్త వ్యాక్సిన్లు, మందులను కనుగొనడానికి సమన్వయీకృతంగా అంతర్జాతీయ స్థాయిలో కృషి చేపట్టాలి.

G-20 fighting over Corona
కలిసి కట్టుగా ఒకే జట్టుగా కరోనాపై జీ-20 పోరు

By

Published : Mar 31, 2020, 7:21 AM IST

కరోనా విసురుతున్న పెను సవాలును జి-20 సమర్థంగా అధిగమిస్తే, కేవలం ఆర్థిక సంక్షోభాలనే కాకుండా ఇతర విధాలైన ఉపద్రవాలను సైతం ఈ కూటమి ఎదుర్కోగలదని నిరూపణ అవుతుంది. అన్ని దేశాలూ ఆరోగ్య వసతులను తక్షణం మెరుగుపరచడానికి చేతులు కలపాలి. మహమ్మారి కట్టడికి కొత్త వ్యాక్సిన్లు, మందులను కనుగొనడానికి సమన్వయీకృతంగా అంతర్జాతీయ స్థాయిలో కృషి చేపట్టాలి. వైద్యులు, నర్సులకు మాస్క్‌లు ఇతర వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)తో పాటు రోగాన్ని వేగంగా కనిపెట్టే టెస్ట్‌ కిట్ల ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలి.

ప్రపంచం అతలాకుతలం

నాలో కరోనా వైరస్‌వల్ల పుట్టుకొచ్చిన కొవిడ్‌ 19 వ్యాధి స్వల్ప కాలంలోనే ప్రపంచమంతటికీ పాకి జన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇది భయంకర అంటువ్యాధి కావడంతో దేశాలు, రాష్ట్రాలు జనం రాకపోకలను అడ్డుకోవడానికి సరిహద్దులు మూసేస్తున్నాయి. అనేక నగరాలు, రాష్ట్రాలు ‘లాక్‌ డౌన్‌’ అమలుచేస్తున్నాయి. ప్రపంచమంతటా లక్షలమందిని ‘క్వారంటైన్‌’లో ఉంచుతున్నారు. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించి, కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. చైనా, ఇటలీ, స్పెయిన్‌, ఇరాన్‌లలో కొవిడ్‌ 19 తీవ్రంగా వ్యాపించి వేలాదిగా జనం చనిపోయారు. ఇప్పుడు ఈ విషయంలో ఈ దేశాలను అమెరికా అధిగమించేట్లుంది. ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించడానికి జి-20 దేశాల అధినేతలు ఇటీవల అసాధారణ రీతిలో వర్చువల్‌ (అంతర్జాల దృశ్య మాధ్యమం) శిఖరాగ్ర సభ జరుపుకొన్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియా అధ్యక్షత వహిస్తున్న జి-20 దేశాల సంఘం కొవిడ్‌ 19 వల్ల సంభవిస్తున్న సామాజిక, ఆర్థిక నష్టాలను అధిగమించడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి అయిదు లక్షల కోట్ల డాలర్లను ప్రవహింపజేయాలని నిశ్చయించింది. కొవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన సంఘీభావ స్పందన నిధికి సభ్య దేశాలు ఇతోధికంగా విరాళాలు ఇవ్వాలని అంగీకరించాయి. ఇవి మెచ్చుకోవలసిన నిర్ణయాలే కానీ, వీటిని ఇంకా ముందే తీసుకొని ఈపాటికే ఆచరణలో పెట్టి ఉండాల్సింది. జి-20 దేశాల్లో మూడింట రెండు వంతుల ప్రపంచ జనాభా నివసిస్తోంది. ప్రపంచ జీడీపీలో 90 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. 80 శాతం ప్రపంచ వాణిజ్యం ఈ దేశాల ద్వారానే జరుగుతోంది. జి-20 సంఘం 1997 ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభాన్ని పురస్కరించుకుని ఆర్థిక మంత్రుల వేదికగా ప్రారంభమైంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరవాత ఇది దేశ నాయకుల వేదికగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం జి-20 దేశాధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమవుతుంటే, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు ఏటా రెండుసార్లు సమావేశమవుతారు. అనధికార స్థాయిలో మాటామంతీ జరుపుకొనే వేదికగా మొదలైనది కాస్తా ఇప్పుడు వివిధ ఖండాలకు, వేర్వేరు ఆర్థిక నేపథ్యాలకు చెందిన దేశాల కీలక వేదికగా మారింది. కరోనా విసరుతున్న పెను సవాలును జి-20 సమర్థంగా అధిగమిస్తే, కేవలం ఆర్థిక సంక్షోభాలనే కాకుండా ఇతర విధాలైన ఉపద్రవాలను సైతం ఎదుర్కోగలదని నిరూపణ అవుతుంది. జి-20 గురుతర బాధ్యతలను తలకెత్తుకుని ఎలాంటి విపత్కర పరిస్థితికైనా సమర్థ పరిష్కారాలు చూపగలనని చాటుకోవాలి.

ఎవరిదారి వారిదే!

మొదట చండప్రచండంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను తక్షణం నిలువరించడానికి ఐక్య కార్యాచరణ చేపట్టాలి. వాస్తవంలో తద్విరుద్ధంగా జరుగుతోంది. ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాకపోకలపై నిషేధాలు విధించడం, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడంతో సరిపెట్టుకుంటున్నారు. అంతర్జాతీయ సమన్వయం లోపించడంతో కరోనాపై ప్రజల్లో భయ విహ్వలత విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. జి-20 వర్చువల్‌ శిఖరాగ్ర సభలో అమెరికా, చైనాలు పరస్పర నిందారోపణలకు దిగకపోయినా, కరోనా సంక్షోభానికి కారణం మీరంటే మీరని బయట ఆరోపణలు రువ్వుకొంటున్న సంగతి తెలిసిందే. చైనా ప్రభుత్వ పత్రికలు, ఇతర సమాచార సాధనాలు అమెరికా సైన్యమే వుహాన్‌లో కరోనా వైరస్‌ను ప్రయోగించిందని కొంతకాలం క్రితం సూచించాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ను ‘చైనీస్‌ వైరస్‌’గా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే. విపత్కాలంలో ప్రపంచాధిపత్యానికి ఆరాటపడకుండా కలసికట్టుగా కార్యాచరణకు దిగాలనే ఇంగిత జ్ఞానం లోపించడం విచారకరం. అన్ని దేశాలూ ఆరోగ్య వసతులను తక్షణం మెరుగుపరచడానికి చేతులు కలపాలి. కరోనా కట్టడికి కొత్త వ్యాక్సిన్లు, మందులను కనుగొనడానికి సమన్వయీకృతంగా అంతర్జాతీయ స్థాయిలో కృషి చేపట్టాలి. వైద్యులు, నర్సులకు మాస్క్‌లు ఇతర వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ)తో పాటు రోగాన్ని వేగంగా కనిపెట్టే టెస్ట్‌ కిట్ల ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలి.

చైనాలో పుట్టిన కొవిడ్‌ 19 వ్యాధి; తరవాత ఇటలీ, స్పెయిన్‌ వంటి ఐరోపా దేశాలకు పాకి నేడు అమెరికాలో విజృంభిస్తోంది. అంటే వ్యాధి ప్రకంపన కేంద్రం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈసారి ఆ కేంద్రం కనుక ఆఫ్రికాకు మారితే ఏమవుతుందో తలచుకోవడానికే భయమేస్తుంది. ప్రస్తుతానికి ఆఫ్రికాలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా, రేపు ఉన్నట్టుండి ఎక్కువైతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఆఫ్రికా దేశాలలో వైద్య వసతులు అంతంతమాత్రమే. ఆర్థికంగా కూడా అవి చాలా బలహీనమైనవి. గృహ వసతి లేక, పౌష్ఠికాహార లోపాలతో ఇప్పటికే అగచాట్ల పాలవుతున్న ఆఫ్రికాపై కనుక కొవిడ్‌ 19 విరుచుకుపడిందీ అంటే, ఎంత నష్టం జరుగుతుందో ఊహకు అందదు. ఈ చేదు వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికా దేశాలు కరోనా వైరస్‌ విరుచుకుపడిన కొత్తల్లో చైనా నుంచి తమ పౌరులను విమానాల్లో సొంత గడ్డకు తీసుకురావడానికి ససేమిరా అన్నాయి. బీజింగ్‌ వారిని తానే పంపుతానన్నా అడ్డుచెప్పాయి. అమెరికా, ఇటలీ వంటి సంపన్నదేశాలే కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్నప్పుడు, ఆఫ్రికా దేశాలు ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోగలుగుతాయి? ఆఫ్రికాకు ఆర్థిక, వైద్య, సాంకేతిక సహకార ప్యాకేజీని వెంటనే ప్రకటించాల్సి ఉన్నా జి-20 దేశాల వర్చువల్‌ సభలో ఆ ఊసే లేకుండా పోయింది. అంతర్జాతీయ నాయకత్వం వహించే అవకాశాన్ని జి-20 ఇలా చేతులారా వదిలేసుకుంది.

మళ్లీ మళ్లీ వస్తే...

అంటు వ్యాధులు ఒకసారి వచ్చి ఆగిపోయినా, కొంత విరామం తరవాత మరింత శక్తితో విరుచుకుపడతాయని చరిత్ర చెబుతోంది. ఈ రెండో విజృంభణ మొదటిదానికన్నా తీవ్రంగా ఉంటుంది. కొవిడ్‌ 19 విషయంలోనూ అలాగే జరగదని హామీ ఏదీ లేదు. చైనా మొదటి విజృంభణ సమయంలో కరోనా గురించి ప్రపంచానికి పూర్తి వివరాలు చెప్పకుండా దాచింది. దాని విష ఫలాల్ని నేడు ప్రపంచమంతా అనుభవిస్తోంది. ఈసారి ఎక్కడ రెండో విజృంభణ సంభవించినా అన్ని దేశాలు పారదర్శకంగా సమన్వయీకృత కృషి చేపట్టాలి. సమాచారాన్ని వేగంగా ఇచ్చిపుచ్చుకొంటూ, వైద్య వసతులు విస్తరించుకుని సర్వసన్నద్ధంగా ఉండాలి.

కరోనా వ్యాప్తిని అడ్డుకున్న తరవాత చేపట్టాల్సిన కార్యాచరణకు ఇప్పటి నుంచే నడుం కట్టాలి. కొవిడ్‌ 19 చికిత్సకు ప్రపంచమంతటా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌, మందుల ప్రయోగాల్లో తలమునకలుగా ఉన్నారు. వారి కృషి ఇవాళ కాకపోతే రేపైనా ఫలిస్తుంది. ఆ తరవాతనే అసలు కథ మొదలవుతుంది. కొవిడ్‌ 19 వల్ల ప్రపంచ సరఫరా గొలుసులు విచ్ఛిన్నమయ్యాయి. స్టాక్‌ మార్కెట్లలో లక్షల కోట్ల డాలర్ల మదుపరుల సంపద ఆవిరైంది. చాలా దేశాల్లో ఇప్పటికే లక్షలమంది ఉపాధి కోల్పోయారు. దానివల్ల వస్తుసేవలకు గిరాకీ పడిపోతోంది. 2019లో 2.9 శాతంగా ఉన్న ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది ఒక శాతానికి పడిపోవచ్చునని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (ఐఐఎఫ్‌) లెక్కగట్టింది. 2008 ఆర్థిక సంక్షోభం తరవాత ఎన్నడూ ఇంత తక్కువ రేటు నమోదు కాలేదు. కొవిడ్‌ 19 వల్ల అప్పటికన్నా దారుణ పరిస్థితులు ఎదురుకావచ్చు. ఈ ప్రమాదాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జి-20 దేశాలు పరస్పరం చర్చించుకుని పకడ్బందీ ప్రణాళికతో ముందుకురావాలి. లేదంటే ప్రపంచార్థిక వ్యవస్థకు కోలుకోలేనంత నష్టం సంభవిస్తుంది. ముఖ్యంగా పేద దేశాలకు జరిగే హాని అంతా ఇంతా కాదు. దాన్ని నివారించడంపై జి-20 దేశాలు దృష్టి కేంద్రీకరించాలి. ఏప్రిల్‌లో జరిగే జి-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం దీనిపై చర్చించి సమగ్ర కార్యాచరణను రూపొందించాలి.

ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యం

కొవిడ్‌ 19 ఉత్పాతానికి లోనవుతున్న ప్రపంచం ఇకపై ఆరోగ్య రక్షణ, రోగ చికిత్స వసతులను విస్తరించడానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులు విరుచుకుపడినా గట్టిగా ఎదుర్కోగల కొత్త మందులు, వ్యాక్సిన్ల తయారీకి పరిశోధన-అభివృద్ధిని ముమ్మరంగా చేపట్టాలి. అందుకు భారీగా నిధులు కేటాయించాలి. పాశ్చాత్య దేశాల్లో అత్యధునాతన వైద్య సౌకర్యాలు ఉంటాయనేది భ్రమేనని నేడు అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లను చూస్తే అర్థమవుతుంది. దాహం వేసినప్పుడు బావి తవ్వడం కాకుండా ముందు నుంచే సర్వసన్నద్ధంగా ఉండాలని ఈ దేశాలు గ్రహించకపోవడం అనర్థదాయకమైంది. వ్యాక్సిన్లు, కొత్త మందుల తయారీ అనేది వారం రోజుల్లోనో, నెలలోనో జరిగే వ్యవహారం కాదు. వీటిపై నిత్యం పరిశోధనలు జరుగుతూ ఉండాలి. ప్రజారోగ్యంపై భారీగా నిధులు వెచ్చించాలి. దానికి కావలసిన ఆర్థిక స్తోమత జి-20 దేశాలకు ఉంది. కొవిడ్‌ 19 వ్యాప్తి ప్రపంచీకరణకు విష పరిణామమని వాదించేవాళ్లు పాశ్చాత్య దేశాల్లో చాలామంది ఉన్నారు. కానీ, ఇలాంటి మహమ్మారుల పని పట్టాలంటే ప్రపంచ దేశాలు చేతులు కలపక తప్పదని వారు గ్రహించడం లేదు. స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులు, అంతర్జాతీయ సమస్యలకు ఏకపక్ష పరిష్కారాలు జగతిని కాపాడలేవు. ఏ దేశానికి ఆ దేశం ‘క్వారంటైన్‌’లోకి వెళ్లకుండా అంతర్జాతీయ కార్యాచరణకు కలసిరావాలి.

రచయిత - డాక్టర్​ మహేంద్రబాబు కురువ

(హచ్​ఎన్​బీ గఢ్వాల్​ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్​ డీన్​)

ఇదీ చూడండి:అమెరికా కంటే భారత్‌లోనే కరోనా మరణాల రేటు ఎక్కువ

ABOUT THE AUTHOR

...view details