కరోనా వ్యాక్సిన్‌ను పూర్తి మోతాదులో తీసుకున్నట్లయితే(రెండు డోసుల్లో) ఇక ఆసుపత్రి ముప్పు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా.. కరోనా వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొని మరణం బారినపడే ప్రమాదం నుంచీ గట్టెక్కినట్లేనని పేర్కొంది.
అమెరికాలో వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు అక్కడి వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం(సీడీసీ) ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14రాష్ట్రాల్లో 24 ఆసుపత్రుల్లోని 417 మంది కొవిడ్ రోగుల సమాచారాన్ని విశ్లేషించింది. వీటిని వ్యాక్సిన్ తీసుకున్న మరో 187 గ్రూపు వారితో పోల్చి చూసింది. తద్వారా పూర్తి మోతాదులో(రెండు డోసులు) వ్యాక్సిన్ తీసుకున్నవారు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం 94శాతం తగ్గిందని గుర్తించింది. ఇక ఒక డోసు తీసుకున్న వారిలో 64 శాతం ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం తగ్గినట్లు సీడీసీ పేర్కొంది. దీంతో ప్రస్తుతం అమెరికాలో పంపిణీ అవుతున్న ఫైజర్, మోడెర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు మరోసారి నిరూపితమయ్యాయని సీడీసీ అభిప్రాయపడింది. అంతేకాకుండా.. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తర్వాతే శరీరం పూర్తిస్థాయిలో రోగనిరోధకత ప్రతిస్పందనలను కలిగి ఉంటున్నట్లు సీడీసీ పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తున్నట్లు తేలడం మనతోపాటు ఆసుపత్రులకు ఊరట కలిగించే విషయమని సీడీసీ డైరెక్టర్ రోషెల్లే వాలెన్‌స్కై పేర్కొన్నారు. టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా ఆసుపత్రుల్లో చేరాల్సినంత ప్రమాదం లేదనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. అందుకే కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రయత్నాలకు విస్తరిస్తూనే ఉంటామన్నారు. తద్వారా ఆసుపత్రి సిబ్బంది, పడకలు, ఇతర సదుపాయాలను ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉంచవచ్చని సీడీసీ చీఫ్ వాలెన్‌స్కై పేర్కొన్నారు.
ఇదీ చదవండి:పేద దేశాల్లో టీకా పంపిణీపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
ఇజ్రాయెల్, బ్రిటన్ నివేదికల్లోనూ ఇవే ఫలితాలు..