నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్నా.. అనూహ్యమేమీ జరగలేదు. హోరాహోరీ పోరు జరిగినా.. సంచలనం నమోదు కాలేదు. ముందు నుంచీ అనుకుంటున్నదే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఆవిష్కృతమైంది. కాస్త ఆలస్యంగా అంతే!
రాజకీయ పండితులు, వార్తా సంస్థలు, మేధో వర్గాలు ఊహించినట్లే డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా గెలుపొందారు. అయితే ఆయన గెలిచారనే కంటే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారనడం కొంతవరకు సమంజసంగా ఉంటుంది. గట్టి పట్టున్న ప్రాంతాలు, రిపబ్లికన్ల కంచుకోటల్లోనూ ట్రంప్ ఓడిపోయారు. మరి ఇంతలా పోరు ఏకపక్షం కావడానికి, ట్రంప్ భారీ ఓటమి మూటగట్టుకోవడానికి కారణమేంటి? ప్రస్తుత అధ్యక్షుడు ఈసారి తప్పక పరాజయం చవిచూస్తారని విశ్లేషకులంతా ముందు నుంచీ బల్లగుద్ది చెప్పడానికి సాక్ష్యం ఏంటి? తరచి చూస్తే ఈ ప్రశ్నలకు అనేక సమాధానాలు లభిస్తాయి.
వర్ణ వివక్ష
జాతి వివక్షే ట్రంప్ ఓటమికి ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అగ్రరాజ్యంలో ఈ సామాజిక రుగ్మత ఇప్పట్లో పుట్టింది కాదు. దురదృష్టవశాత్తు అమెరికా చరిత్ర మొత్తం జాతి విద్వేషంతో మమేకమై ఉంది. అయితే.. నివురుగప్పిన నిప్పులా సాగే ఈ ఉన్మాదవైఖరి ట్రంప్ హయాంలో ఆకాశానికి చేరింది. వర్ణ వివక్ష కాలనాగు పడగవిప్పింది. నల్లజాతీయులపై నేరాలకు ఉసిగొల్పింది.
జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు పోలీసు కిరాతకానికి బలైపోవడంపై నిరసనాగ్రహాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అల్లర్లకు, పోలీసు దమననీతికి దారితీశాయి. శాంతియుత నిరసనలతో పాటు, హింసాత్మక ఆందోళనలు మిన్నంటాయి. కొందరు లూటీలకు పాల్పడ్డారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు అందరికీ విస్మయం కలిగించింది. లూటీలు జరిగితే కాల్పులు జరపాల్సి వస్తుందని ఆయన చేసిన ట్వీట్‌పై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. సైన్యాన్ని దించుతానని చెప్పడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫ్లాయిడ్ మృతిపట్ల పైకి ట్రంప్ విచారం వ్యక్తం చేస్తున్నా ఆయన ట్వీట్లు, చేతలు శ్వేతజాతీయులకు వత్తాసు పలికేలా ఉన్నాయంటూ ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అబ్రహం లింకన్ తర్వాత నల్లజాతీయలకు తనలా ఏ అధ్యక్షుడు మెరుగైన పాలన అందించలేదని గొప్పలు చెప్పుకున్నా... ఆఫ్రో అమెరికన్లపై దాడుల పరంపరతో ఆయనపై విశ్వాసం సన్నగిల్లింది.
కరోనా నియంత్రణ
రెండు లక్షలకు పైగా మరణాలు, కోటికి దగ్గరవుతున్న కేసులు... క్లుప్తంగా అమెరికాలో కరోనా విలయానికి ఈ సంఖ్యలు నిదర్శనం. రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోవాలన్న ట్రంప్ అందమైన కలల్ని ఈ మహమ్మారే కల్లలు చేసింది. అయితే అమెరికాలో కరోనా విలయంలో ట్రంప్ నిర్లక్ష్య వైఖరే ప్రధాన వాటా. ఆయన నిర్లక్ష్యం వల్లే ఎక్కడా లేనన్ని కేసులు మరణాలకు అమెరికా కేంద్ర బిందువుగా మారిందనే ఆరోపణలు మేధోవర్గాలు, శాస్త్రవేత్తల నుంచి వెల్లువెత్తాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభం నుంచీ చైనాపై నోరుపారేసుకుంటూ వచ్చారే కానీ, ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎన్ని కేసులు వచ్చినా దేశంలో ఆంక్షలు విధించేది లేదని తెగేసి చెప్పారు. కనీసం ప్రజలకు జాగ్రత్తలు కూడా చెప్పలేదు. ప్రజలందరూ మాస్కు ధరించాలని అన్ని దేశాల అధినేతలు నెత్తినోర్లు మొత్తుకుంటుంటే.. ట్రంప్ మాత్రం ప్రజలకు చెప్పడం అటుంచితే.. తాను మాస్కు ధరించేందుకే ససేమిరా అన్నారు. ఈ విషయంలో ఆయన చూపించిన మొండి వైఖరి ఎవరికీ తెలియంది కాదు.
ఫలితం... దేశంలో వైరస్ పరిస్థితి మరింత తీవ్రమైంది. ఎన్నికలకు ముందు ట్రంప్‌లానే కరోనా కూడా మొండిగా ప్రబలింది. దీంతో లెక్కలన్నీ మారిపోయాయి. కరోనా నియంత్రణలో విఫలమయ్యారని డెమొక్రాటిక్ పార్టీ సహా అన్ని వర్గాల నుంచి విమర్శల వర్షం కురిసింది. మరోవైపు ఆయన ఆర్భాటంగా నిర్వహించిన సమావేశాలన్నీ కొవిడ్ స్ప్రెడర్లుగా మారాయి. ఇవన్నీ ఆయనకు ప్రతికూలంగా మారాయి. చివరకు తనకూ కొవిడ్ సోకింది. అయినా ఇది ట్రంప్‌కు కలిసిరాలేదు. కొంతవరకు సానుభూతి దక్కినా.. అవి ఓట్ల రూపంలో తన తలుపుతట్టలేకపోయాయి. చివరకు బైడెన్ మద్దతు మరింత పెరిగింది. ట్రంప్ పతనానికి కారణమైంది.
ఆర్థిక వ్యవస్థ