అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన నేతగా ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చరిత్ర సృష్టించారు. ఆయన వరుసగా 1932,1936,1940,1944లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాలుగో దఫా పదవిలో కొనసాగుతూనే 1945 ఏప్రిల్12న మరణించారు. ఎన్నిసార్లయినా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం అప్పట్లో ఉండేది. రెండుసార్లకు మించి ఈ పదవిని చేపట్టరాదని 1951లో రాజ్యాంగాన్ని సవరించారు. ఈ సవరణ అనంతరం అయిదుగురు నాయకులు.. డ్వైట్ డి ఐసెన్ హోవర్, రొనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా రెండుసార్లు అధ్యక్షులయ్యారు.
అతి తక్కువ కాలం పని చేసిన అధ్యక్షుడు విలియం హెన్రీ హారిస్. ఒహోయోకు చెందిన హారిస్ కేవలం 31 రోజులు పదవిలో ఉన్నారు. పదవిలో ఉండి మరణించిన(1841లో) మొదటి దేశాధినేత ఆయనే.
నాడు 6% ఓటర్లే!
తొలి అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన జార్జ్ వాషింగ్టన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరువాత ఏ అధ్యక్షుడూ ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు. వాషింగ్టన్ ఏ పార్టీకీ చెందిన వారు కాదు. 1789 ఏప్రిల్ 30న న్యూయార్క్లో ప్రమాణ స్వీకారం చేశారు. 1797 మార్చి 4న పదవీ విరమణ చేశారు. రెండు దఫాలు అత్యున్నత పదవిని నిర్విహించారు. ముగ్గురు ఉత్తమ అధ్యక్షుల్లో ఒకరిగా వాషింగ్టన్కు పేరుంది. ఒక నాయకుడు రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడంపై మున్ముందు చర్చించాలని ఆయన సూచించారు. ఈ సూచన చాలా కాలం తర్వాత కార్యరూపం దాల్చింది.
అమెరికా తొలి అధ్యక్ష ఎన్నిక నాటికి ఆ దేశ జనాభాలో 6 శాతం మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. చాలా రాష్ట్రాల్లో.. భూములు కలిగిన పురుషుల్లో 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఓటు హక్కుకు యోగ్యులన్న నాటి నిబంధనలే ఇందుకు కారణం. నేడు 18 ఏళ్ల వయసుపైబడిన వారందరికీ ఓటేసే వెసులుబాటు ఉంది. వారు ఫెడరల్, రాష్ట్ర, స్థానిక ఎన్నికల్లో ఓటు వేయవచ్చు.
మహిళలకు ఆలస్యంగా..