ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేవారిని దేశం నుంచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనతో అక్కడి విదేశీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నూతన ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ కోర్సుల్లో చేరి కరోనా బారినపడటమా..లేదా అమెరికా వీసా వదులుకోవడమా అని తర్జనభర్జన పడుతున్నారు.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ ప్రణాళికలన్నీ చెల్లాచెదురయ్యాయని చాలా మంది విద్యార్థులు వాపోతున్నారు. భారత్ సహా చైనా బ్రెజిల్ దేశాలకు చెందిన విద్యార్థులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతోంది. కొంతమంది విద్యార్థులు కెనడా వెళ్లేందుకు యత్నిస్తున్నారు.
"నేను పరిశోధన చేస్తున్నాను. అంతేగాక గొప్ప ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్నాను. ఐదేళ్ల నా పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ఇప్పుడు మూడో సంవత్సరంలో ఉన్నాను. ఒకవేళ నేను టర్కీకి వెళ్లిపోతే అక్కడ ఈ పీహెచ్డీ అందుబాటులో ఉండదు. కాబట్టి నా ప్రతిభకు ప్రశంసలు లభించే చోటుకు నేను వెళ్లాలనుకుంటున్నాను."
-బతుహన్ మెకికెర్, అమెరికాలో చదువుతున్న టర్కీ విద్యార్థి, మోంటనా యూనివర్సిటీ
అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్న జస్దీప్ మండియా (భారత్)... ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులపై యూనివర్సిటీలు కాస్త శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాలు మాత్రం అస్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు.