అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా ఉద్యమించిన నిరసనకారులను పోలీసుల నుంచి కాపాడి ఓ భారతీయ అమెరికన్ హీరోగా నిలిచారు. వాషింగ్టన్ డీసీలో నివసించే రాహుల్ దూబే.. తన ఇంట్లో 75 మంది ఆందోళనకారులకుఆశ్రయం కల్పించి వారి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.
రాహుల్ దూబే (ఎడమవైపు వ్యక్తి) రాజధాని నగరంలో సోమవారం జరిగిన నిరసనలు హింసాత్మకం కావటం వల్ల పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
"పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. పెప్పర్ స్ప్రే చల్లారు. నేను ఒక ఇంట్లో తలదాచుకున్నా. ఆ వీధిలో నివసించేవారు చాలా మంది నిరసనకారులకు ఆశ్రయం ఇచ్చారు."
- ఎలిసన్ లేన్, నిరసకారుడు
ఈ క్రమంలో 75 మందిని తన ఇంట్లో దాచిపెట్టారు రాహుల్. ఆశ్రయం పొందిన వారిలో చాలా మంది తమను రాహుల్ కాపాడినట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఫలితంగా రాహుల్ ఒక్కసారిగా హీరో అయ్యారు.
"గతరాత్రి రాహుల్ మా ప్రాణాలను కాపాడారు. అంతేకాదు మాకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టవద్దని.. శాంతియుతంగా పోరాడాలని సూచించారు. ఈ అద్భుతమైన వ్యక్తికి కృతజ్ఞతలు"
- బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమకారుడు
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు దూబే ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నామని మీకా అనే మరో నిరసనకారుడు చెప్పాడు. ఓ వార్తాసంస్థతో మాట్లాడిన రాహుల్ దూబే.. ఆ రోజు రాత్రి అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు.
"రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో నేను ఇంటి బయట కూర్చున్నా. 15 స్ట్రీట్, స్వాన్ స్ట్రీట్లో జరుగుతున్న నిరసనలను అదుపు చేసేందుకు పోలీసుల బెటాలియన్ వచ్చింది. చాలా మంది మా ఇంట్లోకి వచ్చారు. ఫోన్ ఛార్జ్ చేసుకోవాలని, బాత్రూమ్ ఉపయోగించుకోవచ్చా అని అడిగారు. ఆ సమయంలో వారికి ఆశ్రయం ఇవ్వటం తప్ప తన వద్ద మరో మార్గం లేదు. వారంతా మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లారు."
- రాహుల్ దూబే
రాహుల్ చేసిన సాయానికి చాలా మంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొంతమంది రాహుల్ ఇంటికి పుష్పగుచ్ఛాలు, బహుమతులు పంపి అభినందించారు.
అట్టుడుకుతున్న అగ్రరాజ్యం..
ఆఫ్రికన్-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా వెల్లువెత్తిన ఆందోళనలతో అగ్రరాజ్యం అట్టుడుకుతూనే ఉంది. కర్ఫ్యూను లెక్కచేయని అమెరికన్లు.. భారీగా వీధుల్లోకి చేరుకుంటున్నారు. అరెస్టులు, అల్లర్లు, వాగ్వాదాలు, లూటీలు, హింసాత్మక పరిస్థితులతో అమెరికా రణరంగాన్ని తలపిస్తోంది. అల్లర్ల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. 4 వేలమందికిపైగా అరెస్టయ్యారు. బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది.
ఇదీ చూడండి:'అమెరికా ప్రజలు శాంతియుతంగా ఉండాలి'