అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు పోలింగ్ జోరుగా సాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలవ్వగా.. తాజాగా ఈ జాబితాలోకి ఫ్లోరిడా చేరింది. నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. ముందుగానే ఓట్లు వేసేందుకు ఫ్లోరిడా వాసులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కొన్ని కౌంటీల్లో ఓటు వేసేందుకు 15 నిమిషాల సమయం పడుతుండగా.. మరికొన్నిటిలో ఓటర్లు దాదాపు గంటన్నార పాటు లైన్లల్లో వేచి ఉంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
మూడు గంటల నిరీక్షణ...
పామ్ బీచ్ కౌంటీ ప్రాంతంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈదురు గాలులు కూడా బలంగా వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ ప్రజలు ఓటు వేసేందుకు ముందుకొచ్చారు. మూడు గంటల పాటు లైన్లల్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.